Sajjala Ramakrishna Reddy: అప్పుడు బీజేపీకి 800 ఓట్లు కూడా రాలేదు.. ఇప్పుడు 20 వేలు ఎలా వచ్చాయో తెలియదా?: సజ్జల రామకృష్ణా రెడ్డి
- బీజేపీ అభ్యర్థిని టీడీపీ తన భుజాలపై మోసింది
- మహాపాదయాత్ర రూపంలో చంద్రబాబు మరో రెచ్చగొట్టే చర్య
- అమరావతి ఏమైనా రియల్ ఎస్టేట్ వెంచరా?
బీజేపీ, టీడీపీ, జనసేన ఒకటేనని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. బద్వేలు ఉప ఎన్నిక ఫలితాల అనంతరం నిన్న వైసీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ఆయన ఆ మూడు పార్టీలపై నిప్పులు చెరిగారు. బద్వేలులో పోటీపడింది బీజేపీయే అయినా వారి అభ్యర్థిని మోసింది మాత్రం తెలుగుదేశం పార్టీయేనని ఆరోపించారు.
బద్వేలులో మొత్తం 281 పోలింగ్ కేంద్రాలుంటే వాటిలో పదింటిలో మాత్రమే బీజేపీ ఏజెంట్లు ఉన్నారని, మిగతా అన్ని చోట్లా టీడీపీ వాళ్లే కూర్చున్నారని అన్నారు. కావాలంటే చూడాలంటూ కొన్ని ఫొటోలు మీడియాకు చూపించారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి అక్కడ 800 ఓట్లు కూడా రాలేదని, కానీ ఈసారి 20 వేలకుపైగా ఓట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.
కుప్పంలో చంద్రబాబు సభకు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగిపై టీడీపీ కార్యకర్తలు దాడిచేస్తుంటే కనీసం వారించలేదన్నారు. పైగా ఆ ఉద్యోగి బాంబులు తెచ్చాడని ఆరోపించడం వారి దిగజారుడుతనాన్ని సూచిస్తోందన్నారు. మహాపాదయాత్ర రూపంలో చంద్రబాబు మరో రెచ్చగొట్టే చర్యకు శ్రీకారం చుట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాదయాత్రలో అనుకోని సంఘటన ఏదైనా జరిగితే అరాచకం సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. పాదయాత్రలో రాజకీయ క్రీడ కనిపిస్తోందన్నారు. అమరావతిలో ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, బడుగువర్గాలకు ఇళ్లు ఇస్తుంటే అడ్డుకున్నారని ఆరోపించారు. అమరావతి కొద్దిమంది కోసం పెట్టుకున్నదా? అదేమైనా రియల్ ఎస్టేట్ వెంచరా? అని సజ్జల ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జి.శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. బద్వేలు ఉప ఎన్నిక తీర్పును చూసిన తర్వాతైనా బీజేపీ కళ్లు తెరవాలని హితవు పలికారు. బద్వేలు ఉప ఎన్నికలో బీజేపీ, జనసేన, టీడీపీ ఒక్కటై అభ్యర్థిని నిలిపినా వైసీపీ విజయాన్ని అడ్డుకోలేకపోయారని మంత్రులు కన్నబాబు, సీదిరి అప్పలరాజు ఎద్దేవా చేశారు.