Virat Kohli: విరాట్ కోహ్లీ కుమార్తెకు బెదిరింపులపై స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్.. డీసీపీకి నోటీసులు

Threat messages against kohli daughter Vamika DCW asks Delhi Police to act

  • షమీకి అండగా నిలిచినందుకు బెదిరింపులు
  • ఇది చాలా తీవ్రమైన విషయమన్న డీసీడబ్ల్యూ
  • ఎఫ్ఐఆర్ కాపీ, నిందితుల అరెస్ట్ వివరాలు అందించాలని ఆదేశం
  • దర్యాప్తు జరుపుతున్నామన్న డీసీపీ

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి పాలయ్యాక ఆన్‌లైన్ వేదికగా ట్రోలింగ్ మొదలైంది. మరీ ముఖ్యంగా మహ్మద్ షమీని మతం ప్రాతిపదిక లక్ష్యంగా చేసుకున్నారు. ఆ మ్యాచ్‌లో షమీ ఎక్కువ పరుగులు ఇచ్చుకోవడమే ఇందుకు కారణం. భారత జట్టులోనూ ఓ పాకిస్థానీ ఉన్నాడంటూ తీవ్రస్థాయిలో దూషణలకు దిగారు.

దీంతో కోహ్లీ అతడికి అండగా నిలిచాడు. మత ప్రాతిపదికన ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకోవడం దారుణమన్నాడు. కోహ్లీ దేశభక్తిని, అంకితభావాన్ని శంకించాల్సిన అవసరం లేదన్నాడు. కోహ్లీకి తాము 200 శాతం అండగా ఉంటామని తేల్చి చెప్పాడు.

షమీకి కోహ్లీ ఇలా మద్దతు ప్రకటించాడో, లేదో అలా అతడి కుటుంబాన్ని కొందరు లక్ష్యంగా చేసుకున్నారు. కోహ్లీ-అనుష్కల 10 నెలల కుమార్తె వామికను అత్యాచారం చేస్తామంటూ ట్విట్టర్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. కోహ్లీ కుమార్తెను లక్ష్యంగా చేసుకోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. విషయం తెలిసిన ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ)  డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైం)కు నోటీసులు జారీ చేసింది.

సహచర ఆటగాడు షమీని సమర్థించినందుకు కోహ్లీపై ఆన్‌లైన్ వేదికగా దాడులకు దిగినట్టు తెలిసిందని, ఇది చాలా తీవ్రమైన విషయమని పేర్కొంది. నిందితులపై తక్షణ చర్యలు అవసరమని స్పష్టం చేసింది. ఈ విషయానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీతోపాటు, అరెస్ట్ చేసిన నిందితుల వివరాలు సమర్పించాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. నోటీసులు అందుకున్న డీసీపీ మాట్లాడుతూ, ఈ విషయమై తాము ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News