nsa: ఆఫ్ఘనిస్థాన్ అంశంపై వివిధ దేశాలతో సమావేశం ఏర్పాటు చేస్తున్న భారత్.. పాక్ స్పందన
- ఈ నెల 10, 11న భారత్ సమావేశం
- పలు దేశాలకు ఆహ్వానం
- తాను హాజరుకానన్న పాక్ ఎన్ఎస్ఏ
- భారత తీరు బాగోలేదంటూ వ్యాఖ్య
ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల పాలనలోకి వెళ్లిపోయిన నేపథ్యంలో నవంబరు 10, 11న భారత్ ఓ సమావేశం నిర్వహించనుంది. ఇందులో పలు దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు. పాకిస్థాన్ తో పాటు ఇరాన్, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, రష్యా, చైనా, తదితర దేశాలకు భారత్ ఆహ్వానం పంపింది.
అయితే, ఈ సమావేశానికి తాను హాజరుకానని పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) మొయీద్ యూసఫ్ అన్నారు. అంతేగాక, భారత్‌పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాంతిని కాపాడే శక్తి వినాశకారులకు ఉండబోదని చెప్పుకొచ్చారు. ఆఫ్ఘన్‌లో ప్రస్తుతం ఎలాంటి ఆటంకాలు ఉన్నాయో అందరికీ తెలుసని, దానిపై చర్చించవలసిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.
భారత ప్రభుత్వ తీరు, భావజాలం వల్ల ఆఫ్ఘన్‌లో శాంతి ప్రక్రియ ఏ విధంగా ముందుకెళ్తుందో తనకు తెలియదని అన్నారు. ప్రపంచ దేశాలు కళ్లు మూసుకున్నాయని, ఇండియా తీరుపై ఏ దేశమూ సరైన విధంగా మాట్లాడటం లేదని చెప్పుకొచ్చారు. కాగా, ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పలు దేశాలతో చర్చలు జరుపుతున్నారు.