Congress: హుజూరాబాద్ ఘోర ఓటమిపై టీపీసీసీ పోస్ట్ మార్టం ప్రారంభం!

TPCC Political Affairs Committee Meeting On Huzurabad Bi Poll Failure

  • ఇవాళ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం
  • ఇప్పటికే గాంధీభవన్ కు చేరుకున్న సీనియర్ నేతలు
  • నిన్న పార్టీ నాయకత్వంపై నేతల ఆరోపణలు

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఘోర పరాభవంపై కాంగ్రెస్ తెలంగాణ నాయకత్వం పోస్ట్ మార్టం స్టార్ట్ చేసింది. గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి 60 వేలకుపైగా ఓట్లు వచ్చినా.. తాజా ఉప ఎన్నికల్లో కేవలం 3 వేల ఓట్లే రావడం, డిపాజిట్ గల్లంతు కావడం చర్చనీయాంశమైంది. దీంతో కారణాలేంటన్న దానిపై ఇవాళ గాంధీ భవన్ లో టీపీసీసీ అగ్రనాయకత్వం, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం అవుతోంది.

ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, గీతారెడ్డి, దాసోజు శ్రవణ్ తదితరులు గాంధీభవన్ కు చేరుకున్నారు. కాగా, ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని రేవంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటు పార్టీ సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డిలు చేసిన వ్యాఖ్యలూ పార్టీ నేతల్లో కలకలం రేపాయి.

టీపీసీసీ అగ్ర నాయకుల వల్లే బల్మూరి ఓడిపోయారని, ఆయన్ను బలిపశువును చేశారని జగ్గారెడ్డి ఆరోపించారు. ఇటు కోమటిరెడ్డి మరో అడుగు ముందుకేసి.. కాంగ్రెస్ గెలవదని తెలిసే ఈటలకు మద్దతివ్వాల్సి వచ్చిందంటూ కామెంట్ చేశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఆ తర్వాత పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్కం ఠాగూర్ కొట్టిపారేశారు. తాము బీజేపీకి ఎలాంటి మద్దతూ ఇవ్వలేదన్నారు.

ఈ నేపథ్యంలోనే పార్టీలో విభేదాలు తారస్థాయికి చేరాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ నాయకులు కలిసి పనిచేయకపోవడం వల్లే ఓటమిపాలైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేగాకుండా టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కజిన్ అయిన కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ లో ఉండి టీఆర్ఎస్ కు పనిచేయడం, చివరికి పార్టీ ఫిరాయించడం వంటి వాటి వల్ల కూడా పార్టీపై ఓటర్లలో నమ్మకం పోయిందని చెప్పుకొంటున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని హుజూరాబాద్ ఓటమికి కారణాలను విశ్లేషించేందుకు టీపీసీసీ సిద్ధమైంది. భవిష్యత్ లో ఇలా జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇవాళ్టి సమావేశంలో చర్చించనుంది.

  • Loading...

More Telugu News