Hyderabad: టాలీవుడ్ యువ హీరో ఫామ్‌హౌస్‌లో పేకాట.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు

Poker case In Tollywood young actor Farmhouse Unbelievable fact came to light

  • ప్రధాన సూత్రధారి సుమన్‌ను నిన్న అరెస్ట్ చేసిన పోలీసులు
  • ఫోన్ కాంటాక్ట్స్‌లో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేల నెంబర్లు 
  • ప్రతివారం 200 మందితో గోవాకు
  • క్యాసినోలో గెలుచుకున్న డబ్బుల్లో 40 శాతం వసూలు
  • హైదరాబాద్‌ సహా విజయవాడలోనూ కేసులు

టాలీవుడ్‌ యువహీరో ఫామ్‌హౌస్‌లో ఇటీవల పేకాడుతూ పట్టుబడిన వారిని విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్యాసినోకు ప్రధాన సూత్రధారి అయిన గుత్తా సుమన్‌ను పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. విచారణలో అతడు కూడా పలు కీలక విషయాలు వెల్లడించినట్టు సమాచారం.

అతడి ఫోన్ కాంటాక్స్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీల నెంబర్లు ఉండడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. అయితే, అతడు పంపిన మెసేజ్‌లకు వారి నుంచి స్పందన లేకపోవడంతో సుమన్ వారితో నేరుగా మాట్లాడాడా? లేదంటే మధ్యవర్తులు ఎవరైనా అతడికి సాయం అందించారా? అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

అలాగే, గోవాలో క్యాసినో ఆడేందుకు ప్రతి వారం రెండు వందలమందిని, వారి కోసం యువతులను కూడా వెంట తీసుకెళ్లేవాడని తెలుస్తోంది. గోవా క్యాసినోలో డబ్బులు గెలుచుకున్న వారి నుంచి 40 శాతం తీసుకునే వాడని సమాచారం.

నగరంలోని హోటళ్లు, ఫామ్ హౌస్‌లను అద్దెకు తీసుకుని అందులో పేకాట, క్యాసినోలను సుమన్ నిర్వహిస్తున్నట్టు విచారణలో తేలింది. ఇందులో భాగంగానే నార్సింగ్‌లో ఉన్న ఫామ్‌హౌస్‌ను ఒక రోజు కోసం అడిగి తీసుకున్నట్టు తెలిసింది. వాస్తవానికి ఆ ఫామ్‌హౌస్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గార్గ్‌ది. రెండేళ్ల కోసం యువ హీరో తండ్రి దానిని లీజుకు తీసుకున్నారు. ఆయనతో ఉన్న పరిచయంతో సుమన్ దానిని ఒక రోజు కోసం అడిగి తీసుకున్నాడు.

గచ్చిబౌలి పరిధిలోని సుమధుర కాలనీలోని పేకాట స్థావరాలపై రెండు నెలల క్రితం జరిగిన దాడిలోనూ సుమన్ పట్టుబడ్డాడు. అయితే అప్పుడు అతడు ఆటగాడిగా మాత్రమే ఉన్నాడు. సుమన్‌పై పంజాగుట్ట, కూకట్‌పల్లి, గచ్చిబౌలి, విజయవాడలోనూ కేసులు నమోదై ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. విజయవాడలో తప్ప మిగతా చోట్ల అతడిపై చీటింగ్ కేసులు నమోదు కాగా, విజయవాడలో మాత్రం భూకబ్జా కేసు నమోదు కావడం గమనార్హం.

  • Loading...

More Telugu News