America: హిందువులకు అరుదైన గౌరవం.. అమెరికాలోనూ దీపావళి సెలవు!

Diwali Day Act introduced in US Congress to declare Diwali as federal holiday
  • బిల్లును ప్రవేశపెట్టిన కాంగ్రెస్ విమెన్ కరోలిన్ బి.మలోనీ
  • దీపావళి విశిష్టత, ప్రాముఖ్యంపై అమెరికా కాంగ్రెస్‌లో భారతీయ అమెరికన్ తీర్మానం
  • మద్దతు ప్రకటించిన ప్రముఖ కాంగ్రెస్‌మేన్ గ్రెగరీ మీక్స్
అమెరికాలో హిందువులకు అరుదైన గౌరవం లభించింది. దీపావళి రోజును ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలంటూ న్యూయార్క్‌కు చెందిన ప్రజాప్రతినిధి కరోలిన్ బి.మలోనీ నేతృత్వంలోని చట్టసభ సభ్యులు నిన్న ప్రతినిధుల సభలో బిల్లును ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ విమెన్ మలోనీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇండియన్ కాకస్ సభ్యులతో కలిసి ఈ వారం దీపావళి డే యాక్ట్‌ను ప్రవేశపెడుతున్నందుకు చాలాచాలా ఆనందంగా ఉందన్నారు. ఇది దీపావళిని ప్రభుత్వ సెలవు దినంగా చట్టంలో చేర్చుతుందని అన్నారు.

ఈ చారిత్రాత్మక చట్టాన్ని భారతీయ అమెరికన్ కాంగ్రెస్ మహిళ రాజా కృష్ణమూర్తి సహా అనేకమంది చట్టసభ్యులు కో స్పాన్సర్ చేయడం గమనార్హం. అలాగే, దీపావళి విశిష్టత, ప్రాముఖ్యాన్ని గుర్తిస్తూ అమెరికన్ కాంగ్రెస్‌లో కృష్ణమూర్తి ఓ తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. కరోనా చీకట్ల నుంచి వెలుగులోకి నిరంతర ప్రయాణానికి ఈ దీపావళి ఓ ప్రతీక అని మలోనీ పేర్కొన్నారు.

చీకటిపై వెలుగు సాధించిన విజయానికి, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయాన్ని ప్రతి రోజూ జరుపుకుంటున్నట్టుగానే ఈ దీపావళిని మీతో కలిసి జరుపుకుంటున్నందుకు చాలా గర్వపడుతున్నట్టు చెప్పారు. కొవిడ్ చీకట్ల నుంచి దేశ నిరంతర ప్రయాణాన్ని ఇది సూచిస్తుందన్నారు.

‘‘దీపావళి వంటి వేడుకలు మన దేశం సంతోషం, స్వస్థత, జ్ఞానం, వెలుగు అనిశ్చితి సమయాల నుంచి దారిచూపేలా ఉండాలని మనందరం కోరుకునే ప్రధాన అంశాన్ని తెలియజేస్తాయి. ఈ భయంకరమైన మహమ్మారి నేపథ్యంలో దీపావళిని ఫెడరల్ సెలవు దినంగా మార్చేందుకు ఇంతకుమించిన సందర్భం లేదని సహోద్యోగులు, భారతీయ అమెరికన్లు, నేను విశ్వసిస్తున్నాం’’ అని మలోనీ పేర్కొన్నారు.

ప్రముఖ కాంగ్రెస్‌మేన్, హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గ్రెగరీ మీక్స్ ఈ బిల్లుకు మద్దతు ప్రకటించారు.  ఇది చాలా మంచి రోజని, అమెరికన్ సమాజంలో అందరూ పంచుకోవాల్సిన సంతోషకరమైన సమయమని అన్నారు. హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ దీనికి మద్దతు ఇస్తుందని, ఈ గొప్ప బిల్లును సమర్థిస్తూ ముందుకు సాగుతుందని  ఆయన పేర్కొన్నారు.
America
Diwali
Holiday
Diwali Day Act
American Congress

More Telugu News