kapil dev: ఇక కొత్త కుర్రాళ్లను తీసుకోండి.. పాతవారిని పక్కనపెట్టేయండి: కపిల్ దేవ్ సలహా
- టీ20 ప్రపంచ కప్‌లో తొలి రెండు మ్యాచుల్లో ఓటమి
- ఆటగాళ్లు విఫలం కావడంతో తీవ్ర విమర్శలు
- బాగా ఆడేవారు రాణించకపోతే ఇలాగే ఉంటుందన్న కపిల్
- ఐపీఎల్ లో బాగా రాణిస్తోన్న వారికి అవకాశం ఇవ్వాలని సూచన
ప్రస్తుతం జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్‌లో పాక్, న్యూజిలాండ్ ల చేతుల్లో టీమిండియా పరాజయం పాలైన సంగతి విదితమే. దీంతో టీమిండియాపై విమర్శలు వస్తోన్న వేళ దీనిపై భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ మరోసారి స్పందించారు. బాగా ఆడే సీనియర్లు రాణించకపోతే, తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పారు. టీమ్‌లో ఎవరినయినా పక్కన పెట్టేయాలన్న ఆలోచన వస్తే ముందుగా సీనియర్ ఆటగాళ్లనే తీసేయాలని, వారి స్థానంలో కొత్త కుర్రాళ్లను ఆడించాలని ఆయన స్పష్టం చేశారు.
ఐపీఎల్ లో బాగా రాణిస్తోన్న వారికి అవకాశం ఇవ్వాలని చెప్పారు. క్రికెట్లో తర్వాతి తరాన్ని ఎలా మెరుగ్గా తీర్చిదిద్దాలన్న విషయంపై సెలెక్టర్లు ఆలోచించాలని ఆయన సూచించారు. ఒకవేళ కొత్తవారు ఓడిపోయినప్పటికీ నష్టమేమీ ఉండబోదని, ఎందుకంటే వారికి అనుభవం వస్తుందని చెప్పారు. దీనిపై బీసీసీఐ జోక్యం చేసుకోవాలని, కొత్త వారిని తీసుకోవాలని ఆయన సూచించారు.