Samantha: దీపావళి టపాసులపై సద్గురు జగ్గీ వాసుదేవ్ వ్యాఖ్యలకు సమంత మద్దతు
- దీపావళికి టపాసులే ప్రధాన సందడి
- అభ్యంతరం చెబుతున్న పర్యావరణవేత్తలు
- పిల్లలతో టపాసులు కాల్పించాలన్న సద్గురు
- టపాసులపై నిషేధం వద్దన్న సమంత
దీపావళి భారతీయులకు ఎంతో ఇష్టమైన పండుగ. మిఠాయిలతో, టపాసులతో... అన్నింటికి మించి ఆనందోత్సాహాలతో జరుపుకునే దీపావళి ప్రత్యేకమైనది. అయితే దీపావళి కారణంగా వాయు కాలుష్యం పెరుగుతుందని పర్యావరణవేత్తలు ఎప్పటినుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సద్గురు జగ్గీ వాసుదేవ్ కూడా దీనిపై స్పందించారు.
దీపావళి ఆనందానికి వాయు కాలుష్యం అంశం ప్రతిబంధకంగా మారకూడదని అభిప్రాయపడ్డారు. పిల్లలతో సహా ఎవరూ టపాసులు కాల్చరాదని చెప్పడం సరికాదని, అందుకో ప్రత్యామ్నాయం ఉందని అన్నారు. పెద్దవాళ్లు టపాసులు కాల్చరాదని, పిల్లలతో కాల్పించాలని సూచించారు. తద్వారా పెద్దవాళ్లు పర్యావరణ హితానికి తోడ్పడినట్టవుతుందని, అటు పిల్లలు దీపావళి అనుభూతిని పొందగలుగుతారని సద్గురు వివరించారు.
కాగా, సద్గురు జగ్గీ వాసుదేవ్ అభిప్రాయాలకు టాలీవుడ్ నటి సమంత మద్దతు పలికారు. సద్గురు వ్యాఖ్యలను యథాతథంగా ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో పంచుకున్నారు. అంతేకాదు, టపాసులను నిషేధించవద్దు అంటూ తన అభిప్రాయాన్ని కూడా వెల్లడించారు.