Shoaib Akhtar: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ల 'మౌకా' యాడ్ పై షోయబ్ అక్తర్ ఆగ్రహం

Shoaib Akhtar fires on Mauka ad
  • వరల్డ్ కప్ లలో భారత్ కు మెరుగైన రికార్డు
  • తొలిసారిగా భారత్ ను ఓడించిన పాక్
  • మౌకా అనేది వినోదం కాదన్న అక్తర్
  • ఫైనల్స్ లో భారత్ తమకు మరో మౌకా ఇవ్వాలని వ్యంగ్యం
వరల్డ్ కప్ చరిత్రలో పాకిస్థాన్ పై భారత్ దే పైచేయి అని తెలిసిందే. అన్ని రకాల వరల్డ్ కప్ లలో దాయాదులు 13 సార్లు తలపడగా, 12 సార్లు భారత్ గెలిస్తే, మొన్న ఒక్కసారి పాక్ గెలిచింది. కాగా, పాక్ పై భారత్ రికార్డును దృష్టిలో ఉంచుకుని క్రికెట్ మ్యాచ్ ల ప్రసారకర్తలు కొంతకాలంగా 'మౌకా మౌకా' పేరిట వాణిజ్య ప్రకటనలు రూపొందిస్తున్నారు. ఈ యాడ్స్ దాదాపుగా పాక్ వర్గాలను హేళన చేస్తున్న రీతిలోనే ఉంటాయి. దీనిపై పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

'మౌకా' అనే పదంతో ఇంకెంత మాత్రం పాకిస్థాన్ ను ఎద్దేవా చేయలేరు అంటూ స్పష్టం చేశాడు. సరదా కోసం ఓ దేశాన్ని కించపరుస్తారా? అంటూ ప్రశ్నించాడు. 'మౌకా' అనేది వినోదం ఎంతమాత్రం కాదు అని అన్నాడు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ కు టీమిండియా అర్హత సాధించాలని, అక్కడ మరోసారి పాకిస్థానే గెలవాలని కోరుకుంటున్నట్టు అక్తర్ తెలిపాడు. భారత్ తమకు మరో మౌకా ఇవ్వాలంటూ వ్యంగ్యం ప్రదర్శించాడు. ఈ మెగా టోర్నీలో పాకిస్థాన్-టీమిండియా ఫైనల్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని వెల్లడించాడు.
Shoaib Akhtar
Pakistan
Team India
Ad
T20 World Cup

More Telugu News