Sri Lanka: బ్యాట్‌తో శివాలెత్తిన హెట్‌మయర్.. అయినా విండీస్‌కు తప్పని ఓటమి!

Sri Lanka Won Against West Indies
  • టోర్నీ నుంచి వెళ్తూవెళ్తూ విండీస్ ఆశలను నీరుగార్చిన లంక
  • సహచరుల నుంచి హెట్‌మయర్‌కు లభించని సహకారం
  • అసలంకకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు  
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గత రాత్రి వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకకు ఊరట విజయం లభించింది. ఇప్పటికే సెమీస్ అవకాశాలను చేజార్చుకున్న శ్రీలంక టోర్నీ నుంచి వెళ్తూవెళ్తూ విండీస్‌ను కూడా దెబ్బతీసింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుందామనుకున్న వెస్టిండీస్ ఆశలు ఈ ఓటమితో ఆవిరయ్యాయి.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. పాథుమ్ నిశంక (51), అసలంక (68) అర్థ సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 189 పరుగులు చేసింది. కెప్టెన్ శనక 25 పరుగులు చేశాడు.

అనంతరం 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు మాత్రమే చేసి 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. నికోలస్ పూరన్ 46 పరుగులు చేయగా, సిమ్రన్ హెట్‌మయర్ ఒంటరి పోరాటం చేశాడు. సహచరులందరూ వెనుదిరుగుతున్నా క్రీజులో పాతుకుపోయి శ్రీలంక బౌలర్లను ఇబ్బంది పెట్టాడు. 54 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 81 పరుగులు చేసినప్పటికీ సహచరుల నుంచి అతడికి సరైన సహకారం లభించలేదు.

క్రిస్‌గేల్ (1), రసెల్ (2), కెప్టెన్ కీరన్ పొలార్డ్ (0), జాసన్ హోల్డర్ (8), బ్రావో (2) వంటివారు క్రీజులోకి ఇలా వచ్చి అలా వెళ్లారు. దీంతో విండీస్‌కు మరో ఓటమి తప్పలేదు. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన విండీస్‌ ఒకే ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించి సెమీస్ అవకాశాలు చేజార్చుకుంది. ఇక శ్రీలంక బౌలర్లలో ఫెర్నాండో, కరుణరత్నె, హసరంగ చెరో వికెట్ తీసుకోగా, చమీర, శనక చెరో వికెట్ తీసుకున్నారు. అసలంకకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
Sri Lanka
West Indies
ICC T20 World Cup

More Telugu News