Karnataka: యూనిఫాం తీసేసి రోడ్డుపై పరుగులు పెట్టిన ఎస్సై.. పట్టుకునేందుకు వెంబడించిన ఏసీబీ అధికారులు!

Accused Caught After 1 Km Chase In Karnataka

  • కర్ణాటకలోని తుముకూరులో ఘటన
  • సీజ్ చేసిన వాహనాన్ని వదిలిపెట్టేందుకు రూ. 28 వేల లంచం డిమాండ్
  • రూ.12 వేలు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన కానిస్టేబుల్
  • తన కోసం వస్తున్నారని తెలిసి స్టేషన్ నుంచి బయటకు వచ్చి ఎస్సై పరుగులు

తనను పట్టుకునేందుకు ఏసీబీ అధికారులు వస్తున్నారని తెలిసి ఆ ఎస్సై తన యూనిఫాం తీసేసి మరీ రోడ్డుపై పరుగులు పెట్టాడు. కిలోమీటరు పాటు వెంబడించిన అధికారులు ఎట్టకేలకు అతడిని పట్టుకుని అరదండాలు వేశారు. కర్ణాటకలోని తుముకూరులో జరిగిందీ ఘటన.

ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. తుముకూరు గుబ్బిన్ తాలూకాలోని చంద్రశేఖర్ పొరా పోలీసులు ఓ కేసులో చంద్రన్న అనే వ్యక్తి వాహనాన్ని సీజ్ చేశారు. రూ. 28 వేలు లంచం తీసుకుని ఆ వాహనాన్ని విడిచిపెట్టాలని ఎస్సై సోమశేఖర్ కానిస్టేబుల్‌ నయాజ్ అహ్మద్‌కు చెప్పాడు. బాధితుడు చంద్రన్న వెంటనే ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఎస్సై కోసం వారు కాపుకాశారు.

ఈ క్రమంలో రూ. 12 వేలు తీసుకుంటున్న కానిస్టేబుల్‌ను బుధవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్సై తీసుకోమంటేనే తాను లంచం తీసుకున్నానని కానిస్టేబుల్ చెప్పడంతో అతడితో కలిసి స్టేషన్‌కు బయలుదేరారు. ఏసీబీ అధికారులు తన కోసం వస్తున్నారని గుర్తించిన ఎస్సై తన యూనిఫాం చొక్కాను అక్కడి చెత్తబుట్టలో పడేసి స్టేషన్ నుంచి బయటకు వచ్చి పరుగులు తీశాడు.

అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఏసీబీ అధికారులు అతడిని వెంబడించారు. అలా దాదాపు కిలోమీటరు దూరం అతడి వెనక పరుగులు తీశారు. చివరికి స్థానికుల సాయంతో ఎస్సై సోమశేఖర్‌ను పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

  • Loading...

More Telugu News