China: జిన్ పింగ్ ప్రభుత్వ నిర్ణయాల ఫలితం.. తీవ్ర ఆహార కొరతతో సతమతమవుతున్న చైనా!

China facing deep food scarcity

  • ఇళ్లలో నిల్వలు పెంచుకోవాలంటున్న చైనా ప్రభుత్వం
  • ఎక్కువ ఆహారం తినే వీడియోలను నెట్ లో అప్ లోడ్ చేస్తే శిక్ష
  • ఆహారాన్ని వృథా చేసే వారిపై చర్యలు

చైనాలోని జిన్ పింగ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మహత్యాసదృశమైన పాలసీల కారణంగా ఆ దేశ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. తీవ్ర ఆహార సంక్షోభం దిశగా చైనా అడుగులు వేస్తోంది. సరుకులు కొని నిల్వ చేసుకోండి.. పండ్లు, కాయగూరలు ఆరబెట్టి నిల్వ చేసుకోండి, శీతాకాలంలో ఆహార కొరత రావచ్చు, ఇళ్లలో నిల్వలు పెంచుకోండి అంటూ పాలకులు చేస్తున్న ప్రకటనలు రాబోయే సంక్షోభాన్ని సూచిస్తున్నాయి. అంతేకాదు ఎక్కువగా ఆహారం తినే వీడియోలను ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేస్తే శిక్షిస్తామనే హెచ్చరికలు కూడా వెలువడుతున్నాయి.

సాధారణంగా బాహ్య ప్రపంచానికి తెలిసేలా చైనా ప్రభుత్వ ప్రకటనలు ఉండవు. ఏదైన సమస్య తీవ్రంగా ఉంటేనే ప్రపంచానికి తెలిసేలా ఆ దేశం నుంచి చిన్నచిన్న ప్రకటనలు వెలువడుతుంటాయి. ప్రస్తుతం వెలువడుతున్న ప్రకటనలు కూడా అదే కోవకు చెందుతాయని విశ్లేషకులు అంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత రావచ్చని... చైనీయులంతా సరుకులు కొని నిల్వచేసుకోవాలని చైనా అధికారిక మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ లో చిన్న వార్త వెలువడింది. అయితే బయటకు చెపుతున్న దాని కంటే చైనాలో సమస్య చాలా తీవ్రంగా ఉందని చెపుతున్నారు.

దాదాపు ఏడాదిన్నర నుంచే చైనాలో ఆహార కొరతపై వార్తలు వస్తూనే ఉన్నాయి. గత వెయ్యి సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా వరదలు రావడంతో పంటలు మొత్తం దెబ్బతిన్నాయి. చైనాలో మొత్తం 23,841 డ్యామ్ లు ఉన్నాయి. ప్రపంచంలోని మొత్తం ఆనకట్టల్లో 41 శాతంతో ఇవి సమానం. వీటిలో అత్యధిక డ్యామ్ లు 2000 సంవత్సరం తర్వాత నిర్మించినవే.

అయితే, చైనాలో భారీ వర్షాలు కురుస్తాయనే విషయాన్ని మర్చిపోయి.. నీటిని నిల్వ ఉంచే విధంగా ఈ డ్యామ్ లను నిర్మించారు. భారీ వర్షాలు కురిసే సమయాల్లో కూడా నీటిని కిందకు వదలకుండా, నిల్వ ఉంచేందుకు యత్నిస్తున్నారు. దీంతో, రాత్రికిరాత్రి కురిసే కుంభవృష్టి వర్షాలతో డ్యామ్ లు పొంగి పొర్లుతున్నాయి. ఊళ్లను, పంటను ముంచెత్తున్నాయి. ఆహార కొరత ఏర్పడటానికి ఇది కూడా ఒక కారణమే.

మరోవైపు ఆస్ట్రేలియాపై ఉన్న కోపంతో ఆ దేశం నుంచి బొగ్గు కొనుగోళ్లను చైనా ఆపేసింది. చైనాలో విద్యుదుత్పత్తి ఎక్కువగా బొగ్గు ఆధారంగానే జరుగుతుంది. ఆస్ట్రేలియాతో బొగ్గు కొనుగోళ్లను ఆపేయడం ద్వారా... ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయవచ్చని చైనా భావించింది.

కానీ సీన్ రివర్స్ అయింది. బొగ్గు కొరతతో విద్యుత్ ఉత్పత్తి తగ్గింది. నగరాల్లో స్ట్రీట్ లైట్లు కూడా వెలగని పరిస్థితి నెలకొంది. దీంతో, డీజిల్ నిల్వలను విద్యుత్ ఉత్పత్తికి చైనా ప్రభుత్వం మరల్చింది. ఈ క్రమంలో ఇంధన కొరత ఏర్పడింది. రవాణా సౌకర్యాలకు డీజిల్ కొరత ఏర్పడటంతో అన్నింటి ధరలు పెరిగాయి.

మరోవైపు చైనాలో ఆహారాన్ని వృథా చేసే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మొదలు పెట్టిందని బ్లూమ్ బర్గ్ పత్రిక తెలిపింది. అంతేకాదు కంపెనీలు విలాసవంతమైన భోజన పార్టీలు ఏర్పాటు చేయడంపై కూడా జిన్ పింగ్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఆహార పదార్థాలతో బయో ఇంధనాలను తయారు చేసే కంపెనీలపై కూడా ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో... చైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆ దేశ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News