Payyavula Keshav: సౌర విద్యుత్ కొనుగోళ్లలో భారీ స్కాం జరిగింది: పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపణలు

PAC Chairman Payyavula Keshav alleges huge scam in solar power purchases

  • సంచలన ఆరోపణలు చేసిన పయ్యావుల
  • సోలార్ ధరల్లో అవకతవకలు జరిగాయని వెల్లడి
  • ఎక్కువ ధరకు సోలార్ విద్యుత్ కొన్నారని వివరణ
  • అధిక ధర వెనుక కారణం చెప్పాలంటూ డిమాండ్

ఏపీ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ పయ్యావుల కేశవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సౌర విద్యుత్ కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. సెకీ ద్వారా కొనుగోలు చేసిన సోలార్ విద్యుత్ ధరల్లో అవకతవకలు జరిగాయని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలు యూనిట్ రూ.1.99 కే కొనుగోలు చేస్తే, ఏపీలో మాత్రం రూ.2.49కి కొన్నారని, ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రూ.30 వేల కోట్ల మేర లావాదేవీలకు గంటల్లోనే ప్రతిపాదనలు, ఆమోదాలు తెలపడం వెనుక ఉన్న మతలబు ఏంటని ప్రశ్నించారు.

9 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొన్నామని ప్రచారం చేస్తున్నారని తెలిపారు. గత నవంబరులో పిలిచిన టెండర్లలో యూనిట్ రూ.2కే సౌర విద్యుత్ ఇచ్చారని పయ్యావుల కేశవ్ వివరించారు. గుజరాత్ రూ.1.99కే కొనుగోలు చేసిందని గుర్తుచేశారు. మిగతా రాష్ట్రాలతో పోల్చితే రూ.2.49 ధర ఎలా చౌక అవుతుందని నిలదీశారు. ఈ లెక్కన సెకీ నుంచి డిస్కంలకు చేరేసరికి యూనిట్ ధర రూ.4.50 దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని వ్యాఖ్యానించారు.

దీని వెనుక భారీ అవినీతి దాగి ఉందని, ఈ సౌర విద్యుత్ కొనుగోలు వ్యవహారం స్కీమ్ కాదని, అదానీ కోసం చేసే స్కామ్ అని విమర్శించారు. అదానీకి ఇక్కడ దక్కని టెండర్లను సెకీ రూపంలో కట్టబెట్టారని ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ ఏమైంది? జ్యుడిషియల్ ప్రివ్యూ ఏమైంది? అని పయ్యావుల ప్రశ్నించారు. ఏపీకి 10 వేల మెగావాట్ల ఉత్పత్తికి అవకాశం ఉన్నా, పక్క రాష్ట్రాలకు లబ్ది కలిగేలా నిర్ణయాలు తీసుకోవడం ఎందుకని అన్నారు. మన రాష్ట్రంలోనే సౌర విద్యుత్ కొనుగోలు చేసేలా టెండర్లు పిలవాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News