Passport: అమెజాన్ లో పాస్ పోర్టు కవర్ ఆర్డర్ చేశాడు... కవర్ తో పాటు ఓ పాస్ పోర్ట్ కూడా వచ్చింది!
- కేరళలో ఆసక్తికర ఘటన
- పాస్ పోర్టు కవర్ కోసం ఆర్డర్ చేసిన మిథున్ బాబు
- కవర్ తో పాటు ఓ బాలుడి పాస్ పోర్టు కూడా వచ్చిన వైనం
- పాస్ పోర్టును పోలీసులకు అందించిన మిథున్ బాబు
ఇప్పుడంతా ఆన్ లైన్ కాలం. ప్రజలు ఇల్లు కదలకుండా వస్తు ప్రపంచంలో విహరించే వెసులుబాటు ఉండడంతో, ఈ-కామర్స్ విధానం బాగా పుంజుకుంది. ఎంతో సౌలభ్యం ఉండడంతో ప్రజలు ఆన్ లైన్ విక్రయాలకు మొగ్గుచూపుతున్నారు. అయితే ఒక్కోసారి ఆన్ లైన్ పోర్టల్ కార్యకలాపాల్లో వింతలు, విడ్డూరాలు జరగడం పరిపాటిగా మారింది. వస్తువులు ఆర్డర్ చేస్తే రాళ్లు రప్పలు రావడం, ఒక వస్తువుకు బదులు మరో వస్తువు రావడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
తాజాగా కేరళకు చెందిన ఓ వ్యక్తికి కూడా ఆశ్చర్యకర అనుభవం ఎదురైంది. వాయనాడ్ జిల్లా కనియంబెట్ట ప్రాంతానికి చెందిన మిథున్ బాబు అక్టోబరు 30న ఓ పాస్ పోర్టు కవర్ కోసం అమెజాన్ లో ఆర్డర్ పెట్టాడు. నవంబరు 1న అమెజాన్ వారు డెలివరీ ఇచ్చారు. పార్శిల్ విప్పి చూస్తే పాస్ పోర్టు కవర్ తో పాటు ఆ కవర్లో ఓ పాస్ పోర్టు కూడా దర్శనమిచ్చింది.
ఆ పాస్ పోర్టు ఓ బాలుడికి చెందినది. అది చెల్లుబాటయ్యే పాస్ పోర్టేనని గుర్తించిన మిథున్ బాబు, అమెజాన్ కస్టమర్ కేర్ కు సమాచారం అందించాడు. అయితే వారు సరైన రీతిలో స్పందించకపోవడంతో ఓ మిత్రుడి సలహా మేరకు పోలీసులను సంప్రదించి, వారికి ఆ పాస్ పోర్టును అందించాడు. జరిగిన విషయాన్ని వారికి వివరించి, ఆ పాస్ పోర్టును సొంతదారులకు అప్పగించాలని కోరాడు. ఈ నేపథ్యంలో అసలు విషయం వెల్లడైంది.
అసలేం జరిగిందంటే... సదరు బాలుడి తండ్రి పాస్ పోర్టు కవర్ కోసం అమెజాన్ లో ఆర్డర్ బుక్ చేశాడు. అయితే అమెజాన్ వారు పంపించిన కవర్ తన కుమారుడి పాస్ పోర్టుకు సరిపోయేలా లేకపోవడంతో ఆ కవర్ ను తిరిగి అమెజాన్ వారికి అందజేశాడు. ఇక్కడే పొరబాటు జరిగింది. ఆ కవర్ లో ఉన్న తమ కుమారుడి పాస్ పోర్టును బయటికి తీయకుండా అలాగే రిటర్న్ చేశారు.
ఆ రిటర్న్ చేసిన పాస్ పోర్టు కవర్ ను అమెజాన్ వారు కూడా పరిశీలించలేదు. పాస్ పోర్టు కవర్ కోసం ఇటీవల కన్నియంబెట్ట నివాసి మిథున్ బాబు ఆర్డర్ చేయగానే, ఆ కవర్ ను అతడికి పంపించారు. ఆ విధంగానే బాలుడి పాస్ పోర్టు మిథున్ బాబు వద్దకు చేరింది. కాగా, బాలుడి తల్లి అసాంబి దీనిపై స్పందిస్తూ, తమదే పొరపాటు అని అంగీకరించింది. కవర్ నుంచి తాము పాస్ పోర్టు బయటికి తీయకుండానే అమెజాన్ కు రిటర్న్ చేశామని వెల్లడించింది.