Hyderabad: ట్రయల్ రూములో యువతి దుస్తులు మార్చుకుంటుండగా సెల్‌ఫోన్‌తో చిత్రీకరణ.. జూబ్లీహిల్స్‌లో ఇద్దరు విద్యార్థుల అరెస్ట్

Two youths arrested for filming a woman in trial room in jubilee hills

  • జూబ్లీహిల్స్‌లోని హెచ్ అండ్ ఎం స్టోర్‌లో ఘటన
  • ట్రయల్ రూము ఖాళీల్లోంచి వీడియో చిత్రీకరణ
  • నిందితులు సీఏ, ఇంటర్ విద్యార్థులు

షాపింగ్ మాల్‌లోని ట్రయల్ రూములో ఓ యువతి దుస్తులు మార్చుకుంటుండగా సెల్‌ఫోన్‌తో చిత్రీకరించిన ఇద్దరు విద్యార్థులను హైదరాబాద్, జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం, బాధిత యువతి గురువారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్‌లోని హెచ్‌అండ్ఎం స్టోర్‌లో దుస్తులు కొనుగోలుకు వెళ్లింది.

ఈ సందర్భంగా దుస్తులు సరిచూసుకునేందుకు ట్రయల్ రూముకు వెళ్లగా, అదే దుకాణంలో దుస్తులు కొనుగోలు చేసేందుకు వచ్చిన సీఏ చదువుతున్న కిరీట్ అసత్, ఇంటర్ విద్యార్థి గౌరవ్ కల్యాణ్ పక్కనే ఉన్న మరో ట్రయల్ రూములోకి వెళ్లారు. ఈ క్రమంలో రెండు గదుల మధ్య చిన్నపాటి ఖాళీలు ఉండడంతో వాటిలోంచి యువతి దుస్తులు మార్చుకుంటుండగా మొబైల్‌తో చిత్రీకరించారు.

దీనిని గమనించిన యువతి ఒక్కసారిగా కేకలు వేసింది. అప్రమత్తమైన దుకాణ నిర్వాహకులు విద్యార్థులిద్దరినీ పట్టుకున్నారు. యువతి వారికి దేహశుద్ధి చేసి చిత్రీకరించిన వీడియోను డిలీట్ చేసింది. ఈలోగా సమాచారం అందుకుని అక్కడకు వచ్చిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

అయితే, ఫిర్యాదు చేసేందుకు యువతి నిరాకరించడంతో సుమోటోగా కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు. మరోవైపు, దుకాణానికి వచ్చే వినియోగదారులకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యారంటూ షాపు మేనేజర్ అమన్‌సూరిపైనా కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News