Prosenjith Chhatterjee: ఫుడ్ డెలివరీ అందలేదు... స్విగ్గీ సంగతి చూడండి అంటూ ప్రధాని మోదీ, సీఎం మమతాలను ట్యాగ్ చేసిన బెంగాల్ సినీ నటుడు
- నవంబరు 3న స్విగ్గీలో ఆర్డర్ చేసిన ప్రసేన్ జిత్
- ఫుడ్ డెలివరీ ఇవ్వలేదని వెల్లడి
- ఇచ్చినట్టు మెసేజ్ మాత్రం పంపారని వివరణ
- ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే పరిస్థితి ఏంటన్న నటుడు
దేశంలో అనతికాలంలోనే ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థగా ఎదిగిన స్విగ్గీపై ఓ బెంగాల్ నటుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ సినీ స్టార్ పేరు ప్రసేన్ జిత్ ఛటర్జీ.
నవంబరు 3న స్విగ్గీ యాప్ లో ఫుడ్ డెలివరీకి ఆర్డర్ చేశానని, కానీ ఎంతకీ ఆహార పదార్థాలు తెచ్చివ్వకపోగా, డెలివరీ ఇచ్చినట్టు మెసేజ్ పంపారని ప్రసేన్ జిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేంటని స్విగ్గీని ప్రశ్నిస్తే, తాను చెల్లించిన మొత్తాన్ని తిరిగిచ్చేశారు తప్ప సరిగా స్పందించలేదని ఆరోపించారు. ఈ వ్యవహారం ఏంటో చూడాలని ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
తన పోస్టులో ప్రధానికి, బెంగాల్ సీఎంకు దీపావళి శుభాకాంక్షలు కూడా తెలిపిన ప్రసేన్ జిత్... స్విగ్గీ యాప్ నిర్వాకంపై దృష్టి సారించాలని వారిద్దరినీ కోరారు. ఇలాంటి అనుభవం ఎవరికైనా ఎదురుకావొచ్చని తెలిపారు. ఎవరైనా బంధుమిత్రులు ఇంటికి వచ్చినప్పుడు ఇలాంటి ఘటన జరిగితే ఏంటి పరిస్థితి? అని ఆక్రోశించారు. స్విగ్గీ వంటి ఫుడ్ యాప్ లను నమ్ముకుని వారు ఆకలితో మాడిపోవాలా? అని వ్యాఖ్యానించారు.
ఇలాంటివి చాలా ఘటనలు జరుగుతున్నాయి కాబట్టే ప్రధాని, బెంగాల్ సీఎం వంటి వారు ఈ అంశాన్ని పరిశీలించాలని కోరుతున్నానని ప్రసేన్ జిత్ తెలిపారు.