Vijay Sethupathi: ఎయిర్ పోర్టులో జరిగిన దాడి ఘటనపై విజయ్ సేతుపతి స్పందన
- బెంగళూరు ఎయిర్ పోర్టులో సేతుపతిపై దాడి
- విమానంలోనే గొడవ మొదలైందన్న సేతుపతి
- విమానం ల్యాండయ్యాక కూడా కొనసాగిందని వివరణ
- పోలీస్ స్టేషన్ లో పరిష్కారం అయిందని వెల్లడి
ప్రముఖ దక్షిణాది నటుడు విజయ్ సేతుపతిపై బెంగళూరు ఎయిర్ పోర్టులో దాడి జరగడం తెలిసిందే. విమానాశ్రయం లాంజ్ లో నడుస్తున్న విజయ్ సేతుపతిపై ఓ వ్యక్తి దాడికి దిగాడు. దీనిపై విజయ్ సేతుపతి స్పందించారు. తనపై దాడికి దిగిన వ్యక్తి తమతో పాటే విమానంలో ప్రయాణించాడని వెల్లడించారు. అయితే ఆ వ్యక్తికి, తన సిబ్బందికి మధ్య విమానంలోనే గొడవ మొదలైందని, విమానం దిగిన తర్వాత కూడా వివాదం కొనసాగిందని వివరించారు.
ఓ దశలో అతడు మానసిక సమతుల్యత కోల్పోయాడని, ఆ పరిస్థితిలోనే దాడి చేశాడని, అయితే ఈ వివాదాన్ని పోలీస్ స్టేషన్ లో పరిష్కరించుకున్నామని విజయ్ సేతుపతి వెల్లడించారు.
కాగా, తనకు భద్రతా సిబ్బందిని నియమించుకోవడం ఇష్టముండదని, ప్రతి ఒక్కరితోనూ ప్రేమతో వ్యవహరించడమే తనకు తెలుసని స్పష్టం చేశారు. ప్రేమను పంచితే ఎదుటి వాళ్ల నుంచి కూడా ప్రేమ లభిస్తుందని భావిస్తానని పేర్కొన్నారు. ఎప్పుడు ప్రయాణించినా, తన క్లోజ్ ఫ్రెండ్ వెంటే ఉంటాడని, అతడే తనకు మేనేజర్ కూడా అని వివరించారు. అంతకుమించి తాను భద్రతా సిబ్బందిని కోరుకోనని అన్నారు. ప్రజలతో మమేకం అయ్యేందుకే తాను అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని, భద్రతా సిబ్బంది ఉంటే అది సాధ్యం కాదని విజయ్ సేతుపతి అభిప్రాయపడ్డారు.