South Africa: దురదృష్టమంటే సౌతాఫ్రికాదే.. ఇంగ్లండ్‌పై నెగ్గినా టోర్నీ నుంచి అవుట్!

Rabada hattrick ends Englands unbeaten run but south africa play over
  • ఆల్‌రౌండర్ ప్రతిభతో అదరగొట్టిన సౌతాఫ్రికా
  • రబడ సూపర్ హ్యాట్రిక్
  • పది పరుగుల తేడాతో నెగ్గడంతో మూసుకుపోయిన సెమీస్ దారులు
  • 5 మ్యాచుల్లో నాలుగింటిలో నెగ్గినా దక్కని ఫలితం
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో గత రాత్రి జరిగిన గ్రూప్ 1 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయినప్పటికీ వెంటాడిన దురదృష్టం కారణంగా ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగింటిలో నెగ్గినప్పటికీ పేలవమైన రన్‌రేట్ కారణంగా సెమీస్ బెర్త్‌ను చేజార్చుకుంది. డుసెన్ మెరుపు బ్యాటింగ్, రబడ హ్యాట్రిక్ కూడా జట్టును సెమీస్ చేర్చలేకపోయాయి.

తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేశారు. వాన్ డెర్ డుసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 60 బంతుల్లో 5 ఫోర్లు 6 సిక్సర్లతో అజేయంగా 94 పరుగులు చేశాడు. మార్కరమ్ 25 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 52 పరుగులు చేయడంతో జట్టు స్కోరు పరుగులు పెట్టింది. ఓపెనర్లు హెండ్రిక్స్ 2, డికాక్ 34 పరుగులు చేశారు. ఫలితంగా 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసి ఇంగ్లండ్‌కు భారీ లక్ష్యాన్ని సంధించింది.

190 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. సఫారీ బౌలర్ల దెబ్బకు 179 పరుగులు మాత్రమే చేసి పది పరుగుల తేడాతో ఓటమి పాలైంది. సౌతాఫ్రికా బౌలర్లు సంధించే బంతులను ఎదుర్కోవడం ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్‌కు కష్టంగా మారింది. ఫలితంగా క్రమం తప్పకుండా ఆ జట్టు వికెట్లు కోల్పోయింది. జాసన్ రాయ్ 20, జోస్ బట్లర్ 26, మొయీన్ అలీ 37, డేవిడ్ మలాన్ 33, లివింగ్‌స్టోన్ 28, కెప్టెన్ మోర్గాన్ 17 పరుగులు చేశారు. చివర్లో కగిసో రబడ ఇంగ్లండ్‌ను దారుణంగా దెబ్బతీశాడు. 20వ ఓవర్ తొలి మూడు బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పరాజయాన్ని శాసించాడు.

20 ఓవర్లూ ఆడిన ఇంగ్లండ్ 8 వికెట్లు కోల్పోయి 179 పరుగులు మాత్రమే చేయగలింది. ఫలితంగా 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆల్‌రౌండర్ ప్రతిభతో సౌతాఫ్రికా విజయం సాధించినప్పటికీ సెమీస్ అవకాశాలను కోల్పోయి టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. దక్షిణాఫ్రికాపై ఓడినప్పటికీ నెట్‌రన్‌రేట్ అద్భుతంగా ఉండడంతో ఇంగ్లండ్ స్థానానికి ఎలాంటి ప్రమాదమూ వాటిల్లలేదు. గ్రూప్1లో అగ్రస్థానంలో కొనసాగుతూ సెమీస్‌కు దూసుకెళ్లగా, నిన్న విండీస్‌పై విజయం సాధించిన ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచి మరో బెర్త్‌ను సొంతం చేసుకుంది. అద్భుతమైన బ్యాటింగుతో జట్టుకు విజయాన్ని అందించిన డుసెన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
South Africa
England
ICC T20 World Cup
Rassie van der Dussen

More Telugu News