MLA Sudhakar Babu: సంతనూతలపాడు పరిధిలో అమరావతి రైతుల పాదయాత్రకు అనుమతి ఇవ్వొద్దు: పోలీసులను కోరిన వైసీపీ ఎమ్మెల్యే

YCP MLA Sudhakar Babu wants Padayatra should be stopped in Santhanuthalapadu constituency
  • కొనసాగుతున్న రైతుల పాదయాత్ర
  • నేటికి ఏడవ రోజుకు చేరుకున్న వైనం
  • ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో పాదయాత్ర
  • స్థానిక ఎన్నికల నేపథ్యంలో పాదయాత్ర ఆపాలన్న ఎమ్మెల్యే
అమరావతి రైతులు చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం మహా పాదయాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో పాదయాత్ర జరుగుతోంది. ఈ నేపథ్యంలో... జిల్లాలోని సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు తన నియోజకవర్గం పరిధిలో అమరావతి రైతుల పాదయాత్రకు అనుమతి ఇవ్వొద్దని జిల్లా ఎస్పీని కోరారు.

స్థానిక ఎన్నికలు జరుగుతున్నందున ఆయా ప్రాంతాల్లో పాదయాత్ర ఆపాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ పాదయాత్రను కొనసాగించేట్టయితే, పాదయాత్ర మార్గాన్ని మార్చాలని సూచించారు. పోలీసు అధికారులు తమ విన్నపాన్ని పట్టించుకోకపోతే ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళతామని వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీని ఒంగోలులో కలిసిన ఆయన ఈ మేరకు వివరించారు.

కాగా, అమరావతి రైతుల మహా పాదయాత్ర నేటికి ఏడవ రోజుకు చేరుకుంది. నేడు ప్రకాశం జిల్లాలో పర్చూరు నుంచి ఇంకొల్లు వరకు 17 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టనున్నారు. రైతులు మధ్యాహ్నం వంకాయలపాడులో భోజనం చేశారు. ఈ రాత్రికి రైతులు ఇంకొల్లులో విశ్రమిస్తారు. రేపు పాదయాత్రకు విరామం అని నిర్వాహకులు ప్రకటించారు. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
MLA Sudhakar Babu
Padayatra
Farmers
Amaravati
Prakasam District
YSRCP
Andhra Pradesh

More Telugu News