Team India: టీ20 వరల్డ్ కప్: ఆఫ్ఘనిస్థాన్ ఓటమి... టీమిండియా సెమీస్ ఆశలు గల్లంతు

Team India semis chances ended after Afghanistan lost to New Zealand

  • అబుదాబిలో న్యూజిలాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్
  • 8 వికెట్ల తేడాతో గెలిచిన కివీస్
  • సెమీస్ చేరిన విలియమ్సన్ సేన
  • రేపు చివరి లీగ్ మ్యాచ్ ఆడనున్న టీమిండియా

న్యూజిలాండ్ జట్టుపై ఆఫ్ఘనిస్థాన్ సంచలన విజయం సాధించాలని, తద్వారా టీమిండియా సెమీస్ ఆశలు సజీవంగా నిలవాలని భావించిన అభిమానులకు ఆశాభంగం కలిగింది. ఇవాళ అబుదాబిలో జరిగిన మ్యాచ్ లో ఎలాంటి సంచలనం నమోదు కాలేదు. న్యూజిలాండ్ జట్టు అన్ని రంగాల్లో ఆధిపత్యం కనబరుస్తూ ఆఫ్ఘనిస్థాన్ పై 8 వికెట్ల తేడాతో నెగ్గింది. తద్వారా గ్రూప్-2 నుంచి సెమీఫైనల్లో అడుగుపెట్టింది.

మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్లు 20 ఓవర్లలో 8 వికెట్లకు 124 పరుగులు చేయగా... లక్ష్యఛేదనలో కివీస్ 18.1 ఓవర్లలో 2 వికెట్లకు 125 పరుగులు చేసి విజయభేరి మోగించింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 40, డెవాన్ కాన్వే 36 పరుగులతో అజేయంగా నిలిచారు. అంతకుముందు ఓపెనర్లు మార్టిన్ గప్టిల్ 28, డారిల్ మిచెల్ 17 పరుగులు చేశారు. ఆఫ్ఘన్ బౌలర్లలో ముజీబ్ 1, రషీద్ 1 వికెట్ తీశారు.

కాగా, ఈ టోర్నీ సూపర్-12 దశలో ఇంకా రెండు మ్యాచ్ లు మిగిలున్నాయి. నేడు స్కాట్లాండ్ తో పాకిస్థాన్ ఆడనుంది. రేపు నమీబియాతో టీమిండియా తలపడుతుంది. ఇవాళ ఆఫ్ఘనిస్థాన్ ఓటమి నేపథ్యంలో రేపు టీమిండియా-నమీబియా మ్యాచ్ కు పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. ఈ టోర్నీలో గ్రూప్-1 నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా... గ్రూప్-2 నుంచి పాకిస్థాన్, న్యూజిలాండ్ సెమీస్ చేరాయి.

  • Loading...

More Telugu News