Chittoor District: వర్షం గుప్పిట్లో చిక్కుకున్న నెల్లూరు.. స్తంభించిన జనజీవనం

Nellore is in fist of heavy rains

  • ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలు
  • తడ మండలంలో అత్యధికంగా 16.5  సెంటీమీటర్ల వర్షపాతం
  • చిత్తూరు జిల్లాలోని పలు మండలాల్లో కొట్టుకుపోయిన వంతెనలు
  • స్వర్ణముఖి నదికి పోటెత్తుతున్న వరద
  • వాన, చలికి తట్టుకోలేక వ్యక్తి మృతి

గత నాలుగు రోజులుగా నెల్లూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా నగరం మొత్తం జలమయం అయింది. జనజీవనం అస్తవ్యస్తమైంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వానలు ముంచెత్తాయి. ముఖ్యంగా నెల్లూరు నగరంలో వాన దంచికొడుతోంది.

నగరంలోని ప్రధాన రహదారులపై మోకాలి లోతులో నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు నెల్లూరులో సగటున 6.27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అండర్ పాస్‌లు, ప్రధాన కూడళ్ల వద్ద నీరు నిలిచిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. తడ మండలంలో అత్యధికంగా 16.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

చిత్తూరు జిల్లాలో భారీ వర్షాల కారణంగా స్వర్ణముఖి నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నీటి ఉద్ధృతికి పలు మండలాల్లోని వంతెనలు తెగిపోయాయి. పలు గ్రామాలు నీట మునిగాయి. వాన, విపరీతమైన చలికి తట్టుకోలేక కండ్రిగ గ్రామానికి చెందిన వెంకటకృష్ణయ్య (45) మృత్యువాత పడ్డారు. వరద నీరు గ్రామాల్లోకి చేరుతుండడంతో స్థానిక పాఠశాలల్లో ప్రజలకు వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. మరోవైపు, తిరుమలలో కురుస్తున్న భారీ వర్షానికి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాపవినాశనం, గోగర్భం డ్యామ్‌లు నిండిపోవడంతో నీటిని దిగువకు విడుదల చేశారు.

  • Loading...

More Telugu News