Somu Veerraju: గుంతలు పూడ్చలేని ప్రభుత్వం.. గోతులు తీసే రాజకీయం చేస్తోంది: సోము వీర్రాజు
- రాజధాని నిర్మాణం పేరిట వసూలు చేస్తున్న రూ. 4 సెస్ సంగతేంది?
- పెట్రో ధరల విషయంలో ప్రభుత్వానిది వితండ వాదం
- కేంద్రం పెంచినప్పుడు పెంచి..తగ్గించినప్పుడు తగ్గించరా?
రాష్ట్ర రహదారులపై గుంతలు పూడ్చుకోలేని ప్రభుత్వం గోతులు తీసే రాజకీయం చేస్తోందని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పెట్రో ధరలపై ప్రభుత్వం వితండవాదం చేస్తోందని మండిపడ్డారు. కేంద్రంతో సమానంగా పెట్రో ధరలు పెంచిన ప్రభుత్వం.. తగ్గించినప్పుడు ఎందుకు తగ్గించడం లేదని నిలదీశారు. రాజధాని నిర్మాణం పేరిట రూ. 4 సెస్ వసూలు చేస్తూ రాజధానిని ఎందుకు నిర్మించడం లేదని ప్రశ్నించారు. అలాగే, రహదారి సెస్ పేరుతో రూ. 2 వసూలు చేస్తూ గోతులు ఎందుకు పూడ్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'కేంద్రం వసూలు చేస్తున్న పన్నుల్లో రాష్ట్రాలకు రూ. 19 వేల కోట్లే ఇచ్చిందని మీరు అంటున్నారు. అసలు కేంద్రం ఎంత ఇచ్చిందో లెక్క చెప్పండి' అంటూ ఆయన డిమాండ్ చేశారు. మాటిస్తే మడమ తిప్పనన్న జగన్ రాజధానిపై మాటెందుకు తప్పారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలంగా ఉందని వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు.