Sharmila: 'నేను మీ రాజన్న బిడ్డను.. దీవించండి' అంటూ బామ్మను కోరిన షర్మిల.. వీడియో ఇదిగో
- కొనసాగుతోన్న షర్మిల పాదయాత్ర
- పలు ప్రాంతాల్లో ప్రజలతో మాట్లాడుతోన్న షర్మిల
- కోలాటాలతో షర్మిలకు మహిళల స్వాగతం
- కేసీఆర్ పై మండిపడ్డ షర్మిల
తెలంగాణలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేస్తోన్న పాదయాత్ర కొనసాగుతోంది. ఈ రోజు నల్లగొండ జిల్లా రావిగూడెంలో ఆమె పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ బామ్మతో షర్మిల మాట్లాడుతూ... 'అమ్మా.. నేను మీ రాజన్న బిడ్డను నన్ను దీవించండి' అని కోరారు. ఇందుకు సంబంధించిన వీడియోను వైఎస్సార్టీపీ పోస్ట్ చేసింది. అలాగే, కాచలపారం గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్స్ ఉద్యోగులతో షర్మిల మాట్లాడారు. పలు ప్రాంతాల్లో మహిళలు కోలాటాలతో షర్మిలకు స్వాగతం పలుకుతున్నారు.
కాగా, ఉద్యోగం రాలేదంటూ నల్లగొండ జిల్లా చందంపేట మండల పరిధిలోని గువ్వలగుట్ట గ్రామానికి చెందిన నరేశ్ (30) ఆత్మహత్య చేసుకున్నాడని తెలుపుతూ పలు దినపత్రికల్లో వచ్చిన వార్తలను షర్మిల పోస్ట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు.
'కేసీఆర్ నిర్లక్ష్యానికి వారం రోజులు దాటకముందే మరో నిరుద్యోగి ప్రాణాలు వదిలాడు. ఖాళీలు భర్తీ చేయకుండా నిరుద్యోగుల ఉసురు తీసుకుంటున్నారు. నిరుద్యోగుల తరఫున 15 వారాలుగా మేం దీక్ష చేస్తున్నా ప్రభుత్వం మొద్దునిద్ర వీడడం లేదు. జోహార్ రాకేశ్ యాదవ్.. జోహార్ నిరుద్యోగ అమరవీరులకు' అంటూ షర్మిల ట్వీట్ చేశారు.