Kapil Dev: వీరికి దేశం కంటే డబ్బే ముఖ్యం: భారత క్రికెటర్లపై కపిల్ దేవ్ తీవ్ర వ్యాఖ్యలు
- దేశం కోసం ఆడటాన్ని ప్రతి ఆటగాడు గర్వంగా భావించాలి
- టీ20 ప్రపంచకప్ లో ఓటమి మనకు గుణపాఠం కావాలి
- బీసీసీఐ మరింత బాధ్యతగా వ్యవహరించాలి
టీ20 ప్రపంచకప్ నుంచి టీమిండియా అవమానకరమైన రీతిలో ఇంటిముఖం పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లపై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశం కంటే వీరికి డబ్బే ప్రధానమైపోయిందని మండిపడ్డారు. బాగా డబ్బు సంపాదించి పెట్టే ఐపీఎల్ వీరికి ముఖ్యమైందని అన్నారు. దేశం కంటే కూడా ఐపీఎల్ కే ఆటగాళ్లు ప్రాధాన్యతను ఇస్తే... వారిని ఏమనాలని ప్రశ్నించారు. దేశం కోసం ఆడటాన్ని ప్రతి ఆటగాడు గర్వంగా భావించాలని చెప్పారు.
ఆటగాళ్లకు జాతీయ జట్టే ప్రధానంగా ఉండాలని... ఆ తర్వాతే ఐపీఎల్ ప్రాంఛైజీలని అన్నారు. ఐపీఎల్ ఆడవద్దని తాను చెప్పడం లేదని... అయితే, భవిష్యత్తులో షెడ్యూల్ ను రూపొందించే క్రమంలో బీసీసీఐ మరింత బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. ప్రపంచకప్ లో ఓటమి మనకు ఒక పెద్ద గుణపాఠం కావాలని... మళ్లీ ఇలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.