Sajjala Ramakrishna Reddy: ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రో ధరలు తగ్గించడం రాష్ట్రాలకు సాధ్యపడదు: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల
- కేంద్రం సామాన్యుడి నడ్డి విరిచిందని వ్యాఖ్య
- టీడీపీ, బీజేపీ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపణ
- జగన్ ను దెబ్బతీసే కుట్రకు పాల్పడుతున్నారని ఆగ్రహం
పెట్రో ధరల అంశంపై ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా దీనిపై స్పందించారు. పెట్రో ధరలు విపరీతంగా పెంచిన కేంద్రం సామాన్యుడి నడ్డి విరిచిందని ఆయన విమర్శించారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు ఎక్కడా పెరగలేదని, క్రూడాయిల్ ధర ప్రకారమే అయితే లీటర్ పెట్రోల్ రూ.70 లోపే వస్తుందని అన్నారు.
ప్రస్తుతం పెట్రో ధరలు తగ్గించడం రాష్ట్రాలకు సాధ్యపడదని సజ్జల స్పష్టం చేశారు. మేం తగ్గించాం... మీరు కూడా తగ్గించండి అంటూ రాష్ట్రాలపై పడితే తామేమీ చేయలేమని అన్నారు. పెట్రో ధరలపై టీడీపీ, బీజేపీ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. సీఎం జగన్ ను దెబ్బతీసేందుకు కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పెట్రో ధరలపై వైసీపీ సర్కారు పబ్లిక్ ప్రకటన ద్వారా తేటతెల్లం చేసిందని వెల్లడించారు.