Adimulapu Suresh: మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియా సమావేశంలోకి దూసుకొచ్చిన విద్యార్థి సంఘాలు

Student Unions tries to interrupt minister Adimulapu press meet
  • అనంతపురంలో విద్యార్థులపై లాఠీచార్జి
  • విజయవాడలో మంత్రి ఆదిమూలపు ప్రెస్ మీట్
  • మంత్రిని అడ్డుకున్న విద్యార్థి సంఘాలు
  • లాఠీచార్జి వ్యవహారం తన మంత్రిత్వ పరిధిలోకి రాదన్న మంత్రి
అనంతపురంలో ఎయిడెడ్ కళాశాల విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం పట్ల విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. ఇవాళ విజయవాడ ఆర్ అండ్ బి భవనంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియా సమావేశం నిర్వహిస్తుండగా, విద్యార్థి సంఘాల నేతలు ఒక్కసారిగా దూసుకొచ్చారు. మంత్రి సురేశ్ మీడియా సమావేశాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వీలుకాకపోవడంతో సమావేశం ముగిశాక మంత్రిని అడ్డగించారు.

అనంతపురం లాఠీచార్జి ఘటనపై తమ నిరసన వ్యక్తం చేశారు. ఎయిడెడ్ విద్యాసంస్థలపై ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల ప్రతినిధులు మంత్రి సురేశ్ తో వాగ్యుద్ధానికి దిగారు. ఎయిడెడ్ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులను కొనసాగించాలని స్పష్టం చేశారు. ప్రైవేటు యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తే చదివేవారు ఎలా భరిస్తారని మంత్రిని ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాలను విద్యార్థులు కోల్పోతారని వివరించారు. మంత్రికి వినతిపత్రాలు అందజేశారు.

విద్యార్థి సంఘాల డిమాండ్లపై మంత్రి ఆదిమూలపు స్పందిస్తూ, తాము చిత్తశుద్ధితో, నిబద్ధతతో పనిచేస్తున్నామని, ఇచ్చిన మాట ఎక్కడైనా తప్పితే మీరు నిలదీయండి అని సూచించారు. పోలీసుల లాఠీచార్జి వ్యవహారం తన విద్యాశాఖకు చెందిన విషయం కాదని, తన విద్యాశాఖకు సంబంధించిన సమస్యలపై తాను సమాధానం చెబుతానని అన్నారు.
Adimulapu Suresh
Press Meet
Student Unions
Andhra Pradesh

More Telugu News