Adimulapu Suresh: పోలీసులు లాఠీచార్జి చేయలేదని ఆ అమ్మాయే చెబుతోంది: మంత్రి ఆదిమూలపు సురేశ్

Adimulapu Suresh responds on Ananathapur incident
  • అనంతపురంలో నిన్న విద్యార్థుల నిరసన
  • ఓ విద్యార్థిని తలకు గాయం
  • నిరసనలో దుండగులు ప్రవేశించారన్న మంత్రి ఆదిమూలపు
  • దుండగుల రాళ్లదాడిలోనే విద్యార్థిని గాయపడిందని వెల్లడి
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ నేడు ఏపీ పీజీ సెట్ ఫలితాలను విడుదల చేశారు. విజయవాడ ఆర్ అండ్ బి భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఇతర అంశాలపైనా స్పందించారు. అనంతపురంలో నిన్న విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జిపై మాట్లాడారు.

అనంతపురంలో కాలేజీ ఘటనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. విద్యార్థుల ధర్నాలోకి కొందరు దుండగులు చొరబడ్డారని, పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డారని వెల్లడించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారని, కొన్ని రాజకీయపక్షాలు దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

విద్యార్థుల తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని, దుండగుల రాళ్లదాడిలోనే ఓ విద్యార్థినికి గాయాలయ్యాయని, పోలీసులు లాఠీచార్జి చేయలేదని ఆ అమ్మాయే చెబుతోందని మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. విద్యార్థినిపై జరిగిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యాసంస్థల పనితీరుపై కమిటీ వేశామని, కమిటీ నివేదికను అనుసరించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. మంత్రి ఆదిమూలపు ఈ ప్రెస్ మీట్లో మాట్లాడుతుండగానే విద్యార్థి సంఘాలు దూసుకొచ్చి ఆయనను ఘొరావ్ చేశాయి.

పీజీసెట్ ఫలితాల వివరాలు

ఏపీ పీజీసెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి ఆదిమూలపు సురేశ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో తొలిసారిగా అన్ని యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఒకే సెట్ నిర్వహించామని వెల్లడించారు. ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహించి, రెండు వారాల్లోనే ఫలితాలు ప్రకటించామని తెలిపారు. పీజీ సెట్ కు 39,856 మంది దరఖాస్తు చేసుకోగా... 35,573 మంది పరీక్షకు హాజరయ్యారని వివరించారు. వారిలో 24,164 మంది ఉత్తీర్ణులయ్యారని, పీజీ సెట్ లో 87.62 శాతం మంది అర్హత సాధించారని మంత్రి తెలిపారు.
Adimulapu Suresh
Ananthapur
Police
Students

More Telugu News