CM Jagan: ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో ముగిసిన సీఎం జగన్ భేటీ
- ఒడిశా వెళ్లిన సీఎం జగన్
- భువనేశ్వర్ లో ఒడిశా సీఎంతో సమావేశం
- నేరడి, జంఝావతి, కొఠియా గ్రామాల అంశాలపై చర్చ
- జాయింట్ కమిటీ వేయాలని నిర్ణయం
భువనేశ్వర్ లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. సీఎం జగన్ ప్రధానంగా మూడు అంశాలపై నవీన్ పట్నాయక్ తో చర్చించారు. వంశధార నదిపై నేరడి వద్ద ఆనకట్ట, జంఝావతి ప్రాజెక్టు, సరిహద్దులోని కొఠియా గ్రామాలే అజెండాగా ఈ సమావేశం జరిగింది.
సమస్యల పరిష్కారానికి ఉభయ రాష్ట్రాల సీఎస్ లతో జాయింట్ కమిటీ వేయాలని ఇరువురు సీఎంలు ఈ సందర్భంగా నిర్ణయించారు. ఈ మేరకు సీఎం జగన్, నవీన్ పట్నాయక్ సంయుక్త ప్రకటన చేశారు. రెండు రాష్ట్రాల చర్చలు ఫలప్రదంగా ముగిశాయని వెల్లడించారు. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటున్నాయని తెలిపారు.
"కొఠియా గ్రామాలు, నేరడి బ్యారేజి, జంఝావతి ప్రాజెక్టుపై చర్చించాం. సరిహద్దు సమస్యలు, నీటి వనరులు, పోలవరం, బహుదా జలాల విడుదల, విద్యుత్ అంశాలు, బలిమెల, సీలేరు విద్యుత్ ప్రాజెక్టులు, ఆంధ్రా-ఒడిశా బోర్డర్ లో వామపక్ష తీవ్రవాదం, గంజాయి సాగు, శ్రీకాకుళం అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఒడిశా పీఠం ఏర్పాటు, అదే సమయంలో బరంపురం వర్సిటీలో తెలుగు పీఠం ఏర్పాటు, సరిహద్దు గ్రామాల్లో టీచర్ల నియామకం, పుస్తకాల పంపిణీ తదితర అంశాలపై చర్చించాం" అని సీఎంలు తమ ప్రకటనలో వెల్లడించారు.