Nagenthran K Dharmalingam: భారత సంతతి వ్యక్తికి ఉరిశిక్షను అడ్డుకున్న కరోనా వైరస్
- డ్రగ్స్ రవాణా కేసులో అరెస్టయిన నాగేంద్రన్
- 2009లో చార్జిషీటు నమోదు
- 2010లో మరణశిక్ష విధించిన కోర్టు
- పలు కోర్టుల్లో అప్పీల్ చేసుకున్న నాగేంద్రన్
- ఈ నెల 10న మరణశిక్ష విధించాలని కోర్టు ఆదేశాలు
- కరోనా సోకడంతో నిలిచిన ఉరి
ఆగ్నేయాసియా దేశాల్లో మాదకద్రవ్యాల రవాణాదారులకు కఠినమైన శిక్షలు విధిస్తారు. మలేసియాకు చెందిన భారత సంతతి వ్యక్తి నాగేంద్రన్ ధర్మలింగం డ్రగ్స్ రవాణా కేసులో సింగపూర్ పోలీసులకు పట్టుబడ్డాడు. నేరం నిరూపితం కావడంతో సింగపూర్ కోర్టు నాగేంద్రన్ కు మరణశిక్ష ఖరారు చేసింది. ఈ నెల 10న అతడికి ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంది.
అయితే తన మనసేమీ బాగోలేదని, ఉరి నిలిపివేయాలని నాగేంద్రన్ కోర్టును కోరాడు. దీనిపై న్యాయస్థానంలో విచారణ జరుగుతున్న వేళ, నాగేంద్రన్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని జైలు అధికారులు కోర్టుకు తెలియజేయడంతో ఉరిశిక్ష అమలు నిలిచిపోయింది. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని ఉరి తీయలేమని జడ్జి పేర్కొన్నారు. కేసు విచారణను వాయిదా వేశారు.
ఇంతకీ నాగేంద్రన్ కు మరణశిక్ష పడడానికి కారణమైన నేరం ఏమిటో తెలుసా...? 42 గ్రాముల హెరాయిన్ ను సరఫరా చేశాడంటూ అతడిపై చార్జిషీటు నమోదు చేయగా, కోర్టు 2010లో మరణశిక్ష విధించింది. అప్పటినుంచి వివిధ కోర్టుల్లో నాగేంద్రన్ ధర్మలింగం పోరాడుతూనే ఉన్నాడు.
నాగేంద్రన్ కు ఉరిశిక్షను వ్యతిరేకిస్తూ ఆన్ లైన్ లో పెద్ద ఉద్యమమే నడుస్తోంది. సుమారు 70 వేల మందికి వరకు నాగేంద్రన్ కు మరణశిక్ష వద్దంటూ సంతకాలు చేశారు. దీనిపై మలేసియా ప్రధానమంత్రి కూడా సింగపూర్ ప్రధానికి లేఖ రూపంలో తమ మనోభావాలను వెల్లడించారు.