New Zealand: టీ20 వరల్డ్ కప్: డారిల్ మిచెల్ ధనాధన్ ఇన్నింగ్స్.... ఫైనల్లోకి దూసుకెళ్లిన న్యూజిలాండ్

New Zealand storms into world cup final

  • న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య సెమీస్ సమరం
  • రసవత్తర పోరులో కివీస్ ఘనవిజయం
  • 47 బంతుల్లో 72 పరుగులు చేసిన డారిల్ మిచెల్
  • మెరుపు ఇన్నింగ్స్ ఆడిన జేమ్స్ నీషామ్
  • నేడు రెండో సెమీస్ లో పాక్ వర్సెస్ ఆస్ట్రేలియా

టీ20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ ఫైనల్లో ప్రవేశించింది. కివీస్ ఓపెనర్ డారిల్ మిచెల్ భారీ షాట్లతో విరుచుకుపడి ఇంగ్లండ్ ఆశలపై నీళ్లు చల్లాడు. అత్యంత ఆసక్తికరంగా సాగిన సెమీఫైనల్లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ను ఓడించింది. ఇంగ్లండ్ విసిరిన 167 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలుండగానే ఛేదించింది. డారిల్ మిచెల్ 47 బంతుల్లోనే 72 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. మిచెల్ స్కోరులో 4 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 166 పరుగులు చేసింది. మొయిన్ అలీ (51), డేవిడ్ మలాన్ (41) రాణించారు.

అనంతరం లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 13 పరుగులకే ఓపెనర్ మార్టిన్ గప్టిల్ (4), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (5) ల వికెట్లు కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ డారిల్ మిచెల్ మాత్రం ఇంగ్లండ్ బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి పంపిస్తూ స్కోరుబోర్డును ముందుకు ఉరికించాడు. ఈ క్రమంలో అతడికి వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ డెవాన్ కాన్వే (38 బంతుల్లో 46), జిమ్మీ నీషామ్ (11 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్సులు)ల నుంచి విశేషమైన సహకారం లభించింది.

చివరి 5 ఓవర్లలో మిచెల్, నీషామ్ సిక్సర్ల మోత మోగించడంతో కివీస్ విజయం ఖాయమైంది. ఇక నేడు జరిగే రెండో సెమీఫైనల్లో పాకిస్థాన్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి.

  • Loading...

More Telugu News