Virender Singh: పద్మశ్రీ అవార్డుతో హర్యానా సీఎం ఇంటిముందు నిరసన చేపట్టిన పారా అథ్లెట్
- మంగళవారం పద్మశ్రీ అందుకున్న వీరేందర్ సింగ్
- బుధవారం అదే అవార్డుతో సీఎం ఇంటివద్ద దీక్ష
- పారా అథ్లెట్లందరికీ సమానహక్కులు కల్పించాలని డిమాండ్
- గతంలో అర్జున అవార్డు అందుకున్న సింగ్
పారా అథ్లెట్లకు సమానహక్కులు కల్పించాలంటూ పద్మశ్రీ పురస్కార గ్రహీత, దివ్యాంగ రెజ్లర్ వీరేందర్ సింగ్ ఎలుగెత్తారు. ఈ క్రమంలో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖత్తర్ నివాసం ఎదుట నిరసన చేపట్టారు. వీరేందర్ సింగ్ మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు స్వీకరించారు. ఆ మరుసటి రోజే తన పద్మశ్రీ అవార్డుతో సీఎం ఇంటిముందు దీక్షకు దిగారు. గతంలో ఆయనకు అర్జున అవార్డు కూడా రాగా, ఆ అవార్డును, పారా క్రీడల్లో తనకు వచ్చిన పతకాలను కూడా తన నిరసన దీక్షలో ప్రదర్శించారు.
బధిర క్రీడాకారులకు కూడా ఇతర పారా అథ్లెట్లతో సమానంగా హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రం పారా అథ్లెట్లు అందరినీ ఒకేలా చూస్తున్నప్పుడు, హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సమానత్వం చూపడంలేదని వీరేందర్ సింగ్ ప్రశ్నించారు. బధిర క్రీడాకారులకు కూడా సమాన హక్కులు కల్పించేంత వరకు సీఎం ఇంటి ముందు నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు.