Pakistan: టీ20 ప్రపంచకప్ సెమీస్ కు ముందు పాకిస్థాన్ కు షాక్.. ఇద్దరు స్టార్ ప్లేయర్లకు అనారోగ్యం!
- ఫ్లూతో బాధపడుతున్న షోయబ్ మాలిక్, మహ్మద్ రిజ్వాన్
- నిన్న ప్రాక్టీస్ కు దూరమైన స్టార్ ప్లేయర్లు
- ఈరోజు సెమీస్ లో ఆస్ట్రేలియాతో తలపడనున్న పాక్
ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్ లు ఆడిన పాక్ అన్ని మ్యాచ్ లలో గెలుపొంది సెమీస్ కు చేరింది. అయితే సెమీస్ కు ముందు ఆ జట్టుకు ఎదురు దెబ్బ తగిలింది.
ఫ్లూ కారణంగా షోయబ్ మాలిక్, ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ ఇద్దరూ నిన్న జరిగిన ప్రాక్టీస్ కు దూరమయ్యారు. వారికి నిర్వహించిన కోవిడ్ టెస్టులో నెగెటివ్ అని తేలింది. అయినప్పటికీ ఇద్దరికీ విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. కాసేపట్లో వారికి మరోసారి వైద్య పరీక్షలను నిర్వహిస్తారు. వైద్యులు ఇచ్చే రిపోర్టు ఆధారంగా వారు ఆడతారా? లేదా? అనే విషయం తేలుతుంది.
ఈరోజు ఆస్ట్రేలియాతో పాకిస్థాన్ సెమీ ఫైనల్స్ లో తలపడుతుంది. అనారోగ్యం నేపథ్యంలో ఈ మ్యాచ్ కు మాలిక్, రిజ్వాన్ దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఇదే జరిగితే పాకిస్థాన్ కు పెద్ద సమస్యే అని చెప్పుకోవాలి. ఓపెనర్ గా రిజ్వాన్ ఐదు మ్యాచ్ లలో 214 పరుగులు చేశాడు. షోయబ్ మాలిక్ మిడిలార్డర్ లో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 18 బంతుల్లో 50 పరుగులు చేసి సత్తా చాటాడు. ఒకవేళ వీరిద్దరూ సెమీస్ కు దూరమైతే... వారి స్థానంలో సర్ఫరాజ్ అహ్మద్, హైదర్ అలీలు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.