USA: అమెరికా 'క్యాపిటల్ హిల్'పై దాడిని ముందే హెచ్చరించా.. బ్రిటన్ రాకుమారుడు హ్యారిస్ సంచలన వ్యాఖ్యలు

I Warned A Day Before Prince Harris On Capitol Hill Riots

  • ట్విట్టర్ ప్రేరేపిస్తోందని సంస్థ సీఈవో డోర్సీకి మెయిల్ చేశా
  • తెల్లారే చట్టసభ వద్ద విధ్వంసం
  • అప్పటి నుంచి ఇప్పటిదాకా సమాధానమే లేదు
  • ‘మెగ్జిట్’ అని అనడం కచ్చితంగా ఆడవాళ్లపై ద్వేషం చూపడమే
  • రాజకుటుంబం వారే ‘మెగ్జిట్’ను పెంచి పోషించారు

డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా చట్టసభ క్యాపిటల్ హిల్ పై జరిగిన దాడి ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. అయితే, ఆ దాడి ఘటనపై తాను ముందే హెచ్చరించానని బ్రిటన్ ప్రిన్స్ హ్యారిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక రోజు ముందే ట్విట్టర్ బాస్ జాక్ డోర్సీని దీనిపై అలర్ట్ చేశానని చెప్పారు. అమెరికాలో నిర్వహించిన ‘రీవైర్డ్’ అనే టెక్ ఫోరమ్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సమాచార దుర్వినియోగంలో సోషల్ మీడియా పాత్రపై ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.    

‘‘క్యాపిటల్ హిల్ పై దాడి జరిగేందుకు మీ ట్విట్టర్ ప్రేరేపిస్తోందని డోర్సీని ముందు రోజే హెచ్చరిస్తూ మెయిల్ చేశా. కానీ, ఆయన నుంచి ఎలాంటి సమాధానమూ రాలేదు. అప్పట్నుంచి ఇప్పటిదాకా ఆయన్నుంచి విన్నదేం లేదు’’ అని ఆయన అన్నారు. సోషల్ మీడియా అనలిటిక్స్ సంస్థ బాట్ సెంటినెల్ 70 శాతం విద్వేష కథనాలకు 83 అకౌంట్లు కారణమని పేర్కొంటూ గత నెలలో ఓ నివేదికను విడుదల చేసింది. దానిపై స్పందించిన ఆయన.. చాలా మంది బ్రిటీష్ జర్నలిస్టులు వారితో కుమ్మక్కై అబద్ధాలను వండి వడ్డిస్తున్నారన్నారు. ఆ అబద్ధాలనే నిజాలంటూ జనాలకు చెబుతున్నారన్నారు.

తప్పుడు సమాచారాన్ని ఆపేందుకు సోషల్ మీడియా సంస్థలు ఏ మాత్రమూ ప్రయత్నించట్లేదని విమర్శించారు. ఇంటర్నెట్ అంటేనే ‘ద్వేషం, విభజన, అసత్యాలు’ అనేలా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము రాజకుటుంబం నుంచి విడిపోయేటప్పుడు బ్రిటన్ వార్తా సంస్థలు ‘మెగ్జిట్’ అంటూ కథనాలు రాశాయని, ఆడవారి పట్ల వారికి ఎంతటి ద్వేషం ఉందో దాన్ని బట్టి అర్థమవుతుందని ఆయన విమర్శించారు. జనాలకు తెలుసో లేదో తెలియదుగానీ.. మెగ్జిట్ అనే పదం మాత్రం కచ్చితంగా ఆడవాళ్లపై ద్వేషమేనని అన్నారు.

ఎవరో ఒకరు ఈ పదంతో విమర్శలు గుప్పిస్తే.. రాజకుటుంబంలోని వారు దానికి మరింత ఆజ్యం పోసి ఎగ దోశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాఅలా అది ప్రధాన వార్తా స్రవంతిలోకి ఎక్కిందన్నారు. బ్రిటన్ లోని కొన్ని మీడియా సంస్థలు.. మెఘన్ పై జాత్యాహంకార కథనాలను రాశాయని, నల్లజాతీయురాలు–తెల్లజాతీయుడికి పుట్టిన బిడ్డ అంటూ వార్తలు రాసుకొచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా రాజకుటుంబం నుంచి విడిపోయాక గత ఏడాది మెఘన్ మార్కెల్ తో కలిసి హ్యారిస్ అమెరికాలోని కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News