Kollywood: పునీత్ మృతిపై రజనీకాంత్ సంతాపం.. కన్నింగ్ ఫెలో అంటూ రజనీపై విమర్శల వెల్లువ

Rajinikanth Condolences Lead To Massive Trolls On Social Media
  • కొన్నాళ్లుగా ఆసుపత్రిలో రజనీకి చికిత్స
  • ఇటీవలే డిశ్చార్జ్ అయి ఇంటికి
  • పునీత్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని నిన్న సందేశం
  • హూట్ యాప్ లో సంతాపం.. పునీత్ అభిమానుల మండిపాటు
  • సొంత యాప్ ను ప్రమోట్ చేసుకోవడానికంటూ విమర్శలు 
పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం నుంచి కన్నడ సినీ పరిశ్రమ, అభిమానులు ఇంకా తేరుకోనేలేదు. ఏదో ఒక రకంగా ఆయన్ను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఇటీవల జిమ్ లో వర్కౌట్లు చేస్తూ పునీత్ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.

తాజాగా తమిళ్ తలైవా రజనీకాంత్.. పునీత్ మృతిపై స్పందించారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలోనే పునీత్ మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన రజనీకాంత్.. పునీత్ మరణంపై చలించిపోయారు. తన కూతురు రూపొందించిన హూట్ యాప్ లో సందేశాన్ని వినిపించారు.

‘‘నువ్వు లేవన్న విషయాన్ని నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను పునీత్.. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా నాన్నా’’ అని చెప్పారు. ట్వీట్ కు హూట్ యాప్ లో తన ఆడియో సందేశ లింకును జత చేశారు. అయితే, ఆయన ఇచ్చిన సందేశంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆయనిచ్చిన సందేశంలో ఎలాంటి లోపం లేకపోయినా.. ఆయన ఎంచుకున్న మాధ్యమమే తప్పని పునీత్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పునీత్ కు నివాళులర్పిస్తున్నట్టు లేదని, తన కూతురు యాప్ ను ప్రమోట్ చేసుకోవడానికే పునీత్ మరణాన్ని వాడుకుంటున్నారని విమర్శిస్తున్నారు. ‘‘మీ లాంటి గొప్ప నటులు యాప్ ప్రమోషన్ కోసం మరణ సందేశాలను ఇవ్వడం షాక్ కు గురి చేసింది’’ అని ఓ అభిమాని ఆవేదన వ్యక్తం చేశారు.

'ఇక హూట్ యాప్ ను సంతాపాల కోసమూ వాడుకోవచ్చన్నమాట' అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'మీరు సంతాపం తెలియజేస్తున్నారా? లేదంటే యాప్ ను ప్రమోట్ చేసుకుంటున్నారా?' అంటూ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. ఇంత చెత్త పద్ధతిలో యాప్ ను ప్రమోట్ చేయడం ఆపేయండంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. మరీ ఇంత నీచానికి దిగజారిపోతారా? అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

ఓ అభిమానై అయితే 'కన్నింగ్ ఫెలో' అంటూ రజనీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. పునీత్ చనిపోయి పదిరోజులవుతుంటే ఇప్పుడా సంతాపం తెలిపేది? అంటూ విమర్శించాడు. అది కూడా కూతురు తయారు చేసిన హూట్ యాప్ ను ప్రమోట్ చేసుకోవడానికా? అంటూ మండిపడ్డాడు. దేవుడు మీకు మంచి గుణపాఠం నేర్పుతాడంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. రజనీకాంత్ కూడా వంద శాతం వ్యాపారిలా మారిపోయాడంటూ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Kollywood
Sandalwood
Puneet Rajkumar
Rajinikanth
Tollywood

More Telugu News