Pakistan: భారీ షాట్లతో విరుచుకుపడిన పాక్ ఆటగాళ్లు... ఆసీస్ టార్గెట్ 177 రన్స్
- టీ20 వరల్డ్ కప్ లో రెండో సెమీస్
- ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్థాన్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్
- 20 ఓవర్లలో 4 వికెట్లకు 176 రన్స్ చేసిన పాక్
- రిజ్వాన్, జమాన్ అర్ధసెంచరీలు
టీ20 వరల్డ్ కప్ రెండో సెమీస్ లో ఆస్ట్రేలియాపై పాకిస్థాన్ టాపార్డర్ అదరగొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 176 పరుగులు చేసింది. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్, వన్ డౌన్ బ్యాట్స్ మన్ ఫకార్ జమాన్ అర్ధసెంచరీలు సాధించారు. రిజ్వాన్ 52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. జమాన్ 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 55 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కెప్టెన్ బాబర్ అజామ్ 39 పరుగులు సాధించాడు. హార్డ్ హిట్టర్ ఆసిఫ్ అలీ డకౌట్ అయ్యాడు. కమిన్స్ బౌలింగ్ లో స్మిత్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ బౌలింగ్ ఎంచుకోగా, పాక్ ఓపెనర్లు ఆది నుంచి ఎదురుదాడికి దిగడంతో స్కోరు ఎక్కడా తగ్గలేదు. దానికితోడు ఆసీస్ ఆటగాళ్ల పేలవ ఫీల్డింగ్ కూడా పాక్ కు కలిసొచ్చింది. ఆసీస్ ఫీల్డర్లు పలు క్యాచ్ లు వదిలి పాక్ భారీ స్కోరుకు పరోక్షంగా సహకరించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 2, కమిన్స్ 1, జంపా 1 వికెట్ తీశారు.