Rajachari: అంతరిక్షంలోకి తెలుగు సంతతి వ్యక్తి... ఆర్నెల్ల పాటు ఐఎస్ఎస్ లో ఉండనున్న రాజాచారి

Telugu origin astronaut Rajachari explores into space
  • మహబూబ్ నగర్ జిల్లాలో మూలాలు
  • అమెరికాలో స్థిరపడిన రాజాచారి కుటుంబం
  • అమెరికా వాయుసేనలో ఉన్నతోద్యోగం
  • 2017లో నాసా వ్యోమగామిగా ఎంపిక
  • తాజాగా స్పేస్ ఎక్స్ ద్వారా అంతరిక్ష యాత్ర
ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ రోదసీ యాత్రల సంస్థ తాజాగా ఎండ్యూరెన్స్ వ్యోమనౌకను అంతరిక్షంలోకి పంపింది. ఈ నౌకలో భారత సంతతికి చెందిన రాజాచారి కూడా ఉన్నారు. భూ కక్ష్యలో పరిభ్రమిస్తున్న ఐఎస్ఎస్ (ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్)లో రాజాచారి ఆర్నెల్ల పాటు ఉండనున్నారు. రాజాచారితో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు కూడా స్పేస్ ఎక్స్ ఎండ్యూరెన్స్ వ్యోమనౌకలో రోదసిలో ప్రవేశించారు. వీరు ప్రయాణించిన స్పేస్ క్రాఫ్ట్ ను నేడు ఐఎస్ఎస్ తో అనుసంధానం (డాకింగ్) చేయనున్నారు.

ఈ రోదసియాత్రకు కమాండర్ గా వ్యవహరిస్తున్న రాజాచారి మూలాలు తెలంగాణలో ఉన్నాయి. ఆయన తండ్రి పేరు శ్రీనివాస్ చారి. మహబూబ్ నగర్ కు చెందిన చారిది విద్యావేత్తల కుటుంబం. రాజాచారి తాత ఉస్మానియా వర్సిటీలో మ్యాథ్స్ ప్రొఫెసర్. రాజాచారి తండ్రి ఉస్మానియా నుంచి ఇంజినీరింగ్ పట్టా అందుకున్నారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లిన శ్రీనివాస్ చారి అమెరికాకు చెందిన అమ్మాయి (పెగ్గీ ఎగ్బర్ట్)ని వివాహం చేసుకున్నారు.

రాజాచారి అమెరికాలోనే జన్మించారు. ఆయన ప్రతిష్ఠాత్మక ఎంఐటీ నుంచి ఆస్ట్రోనాటిక్స్, ఏరోనాటిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు. ఆపై అమెరికా ఎయిర్ ఫోర్స్ లో ఉన్నతస్థాయి అధికారిగా పనిచేశారు. ఆమెరికా నేవీ టెస్ట్ స్కూల్ పైలెట్ కోర్సు కూడా విజయవంతంగా పూర్తి చేశారు. నాలుగేళ్ల కిందట నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు. తన రోదసి యాత్ర కలను తాజాగా స్పేస్ ఎక్స్ ద్వారా నెరవేర్చుకున్నారు. రాజాచారికి ఇదే తొలి అంతరిక్ష యాత్ర.
Rajachari
ISS
SpaceX
NASA
USA
Mahabubnagar District
Telangana
India

More Telugu News