Cricket: ఓటమికి ఆ ఒక్కడే కారణం కాదు: పాక్ కెప్టెన్ బాబర్ ఆజం

He is Not Alone Responsible For Defeat Says Babar Azam

  • డ్రెస్సింగ్ రూంలో సహచరులకు హితబోధ
  • ఎవరూ ఎవరిపైనా వేలెత్తి చూపొద్దని సూచన
  • ఒక్క ఓటమితోనే ఏమీ అయిపోలేదని కామెంట్
  • జట్టు ఐక్యతను ఓటమి దెబ్బతీయకూడదని హితవు

‘క్యాచెస్ విన్ ద మ్యాచెస్’.. ఈ నానుడి మరోసారి రుజువైంది. పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో పాక్ ఫీల్డర్ హసన్ అలీ వదిలేసిన క్యాచ్ తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అప్పటిదాకా పాక్ వాకిట్లోనే ఉన్న విజయం కాస్తా.. ఆ వదిలేసిన క్యాచ్ తో ఆస్ట్రేలియా గుమ్మం తొక్కింది. క్యాచ్ డ్రాప్ తో బతికిపోయిన మాథ్యూ వేడ్.. షాహీన్ అఫ్రిదీ బౌలింగ్ లో హ్యాట్రిక్ సిక్స్ లు బాది విజయాన్ని లాగేసుకున్నాడు. దీంతో పాకిస్థాన్ ఇంటి బాట పట్టినట్టయింది.
అయితే, ఓటమికి ఆ ఒక్కడే కారణం కాదని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం అన్నాడు. ఎవరు..ఎవరి మీదా వేలెత్తి చూపరాదని జట్టు సభ్యులకు సూచించాడు. మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూంలో అతడు జట్టు సభ్యులకు హితబోధ చేశాడు. ఈ ఒక్క ఓటమితోనే ఏమీ అయిపోలేదని, టోర్నమెంట్ లో మంచి ఆట ఆడామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించాడు. ఓటమితో బాధ కలగడం సహజమని, కానీ, ఎక్కడ పొరపాట్లు చేశామో జట్టు సభ్యులుగా అందరికీ తెలుసని, వాటి నుంచి నేర్చుకుంటూ ముందుకు పోవాలని చెప్పాడు. మళ్లీ ఆ తప్పులు జరగకుండా సరిచేసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నాడు.

ఓ జట్టుగా ఆడాం కాబట్టే.. ఇక్కడిదాకా వచ్చామని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేక్ చేయొద్దని జట్టు సభ్యులకు హితవు చెప్పాడు. ‘నీ ఆట బాగాలేదు.. వాడు బాగా ఆడలేదు’ అంటూ ఎవరిపైనా వేలెత్తి చూపొద్దన్నాడు. ఎవరూ ప్రతికూలాంశాలను చర్చించకూడదన్నాడు. ఎంతో కష్టపడి నిర్మించుకున్న జట్టు ఐక్యతను.. ఈ ఒక్క ఓటమితో దెబ్బ తీయకూడదని సహచరులకు సూచించాడు. కెప్టెన్ గా ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానన్నాడు. జట్టులో ప్రస్తుతం ఓ కుటుంబ వాతావరణం ఉందని, ప్రతి ఒక్కరూ ప్రతి గేమ్ లో బాధ్యతగా ఆడారని చెప్పాడు. మన చేతుల్లో ఉన్నది కేవలం ప్రయత్నం చేయడమేనని, ఫలితం మన చేతుల్లో లేదని తెలిపాడు. జట్టుగా ప్రయత్నిస్తే ఫలితాలు వాటంతట అవే వస్తాయని హితబోధ చేశాడు.

  • Loading...

More Telugu News