Cricket: నీతి లేని మనిషంటూ డేవిడ్ వార్నర్ పై విమర్శలు.. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా షాట్.. ఇదిగో వీడియో
- హఫీజ్ బౌలింగ్ లో పిచ్ దాటి ఆడిన వార్నర్
- చేజారి రెండు బౌన్స్ లతో పూర్తిగా లెగ్ సైడ్ పడిన బంతి
- మండిపడుతున్న క్రీడాభిమానులు
- షాట్ పై గౌతమ్ గంభీర్ స్పందన
2018లో ఆస్ట్రేలియా బాల్ ట్యాంపరింగ్ వివాదం ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆ ఏడాది మార్చిలో దక్షిణాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా నాటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ లు బంతిని శాండ్ పేపర్ తో రుద్ది అడ్డంగా బుక్కయ్యారు. ఆ తర్వాత చేసిన నేరాన్ని ఒప్పుకొన్నారు. కొన్నాళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ కు దూరమయ్యారు. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిన ఆ ఇద్దరినీ ‘చీటర్స్’ అంటూ అంతర్జాతీయ సమాజం మొత్తం దుమ్మెత్తి పోసింది.
తాజాగా అంత పెద్ద వివాదం కాకపోయినా.. డేవిడ్ వార్నర్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. క్రికెట్ అభిమానుల చేత ‘నీతి లేని మనిషి’ అని అనిపించుకున్నాడు. అందరి నోళ్లలో పడి విమర్శల పాలవుతున్నాడు. అసలేం జరిగిందో తెలియాలంటే ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లోని ఎనిమిదో ఓవర్ కు వెళ్లాలి. ఏడు ఓవర్లు ఆడి రెండు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 57 పరుగులతో లక్ష్యఛేదనలో వెనుకంజలోనే ఉంది. అయితే, 8వ ఓవర్ వేసేందుకు మహ్మద్ హఫీజ్ బంతిని అందుకున్నాడు.
అక్కడ రాత్రి పూట తేమ ఎక్కువగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ ఓవర్ తొలి బంతే చేజారి పూర్తిగా లెగ్ సైడ్ వైపు వెళ్లింది. బంతి రెండు సార్లు బౌన్స్ అయింది. అయినా గానీ అక్కడ డేవిడ్ వార్నర్ కనికరం చూపలేదు. క్రీడా స్ఫూర్తినీ చాటలేదు. నెమ్మదిగా వచ్చిన ఆ బంతిని మొత్తం పిచ్ దాటేసి వచ్చి మరీ బాదాడు. అది కాస్తా స్టాండ్స్ లో పడింది. దీంతో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం, హఫీజ్ లు బిత్తరపోయి చూడడం తప్ప ఏమీ చేయలేకపోయారు.
దీనిపైనే ఇప్పుడు వార్నర్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఆడాడంటూ సగటు అభిమాని, నెటిజన్లు మండిపడుతున్నారు. ‘‘సిగ్గులేదు.. గౌరవం లేదు.. నీతి నియమం లేని మనిషి’’ అని ఓ అభిమాని ఫైర్ అయ్యాడు. అదంతా తమకు అనవసరమని, ఆ మ్యాచ్ లో పాక్ ఓడిపోవడమే తమకు కావాలని మరికొందరు అభిమానులు కామెంట్ చేశారు. మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కూడా దానిపై రెస్పాండ్ అయ్యాడు. క్రీడా స్ఫూర్తిని చూపడంలో వార్నర్ విఫలమయ్యాడని పేర్కొన్నాడు.