Virat Kohli: విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్సీపై అనిశ్చితి.... రోహిత్ శర్మకే పగ్గాలు అప్పగించే అవకాశం!
- ఇప్పటికే టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ తొలగింపు
- కొత్త కెప్టెన్ గా రోహిత్ శర్మ
- వన్డే కెప్టెన్సీపై కోహ్లీతో చర్చించనున్న బీసీసీఐ
- దక్షిణాఫ్రికాతో సిరీస్ కు ముందే నిర్ణయం!
గత కొన్నాళ్లుగా విరాట్ కోహ్లీ ఫామ్ ఏమాత్రం ఆశాజనకంగా లేదన్నది గణాంకాలు చెబుతున్నాయి. కోహ్లీ సెంచరీ చేసి చాన్నాళ్లయింది. మూడు ఫార్మాట్లలోనూ జట్టు నాయకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తుండడం అతడి ఆటతీరుపై ప్రభావం చూపుతోందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. కోహ్లీ కూడా అదే అభిప్రాయంతో ఉన్నాడు. అందుకే ఆటపై మరింత దృష్టి పెట్టేందుకు వీలుగా టీ20 కెప్టెన్సీని వదులుకున్నాడు. అయితే బీసీసీఐ మరోలా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. కోహ్లీపై వన్డే కెప్టెన్సీ భారాన్ని కూడా తగ్గించాలని యోచిస్తోంది.
ఇప్పటికే భారత జట్టు టీ20 కెప్టెన్సీ పగ్గాలను రోహిత్ శర్మకు అప్పగించిన బీసీసీఐ...50 ఓవర్ల ఫార్మాట్లోనూ అతడినే కెప్టెన్ గా నియమించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో వన్డే కెప్టెన్సీపై కోహ్లీతో బీసీసీఐ చర్చించనుంది. మరికొన్ని నెలల్లో దక్షిణాఫ్రికా సిరీస్ ఉంది. ఈ సిరీస్ కు ముందే వన్డే కెప్టెన్సీపై నిర్ణయం తీసుకోవాలని బోర్డు భావిస్తోంది.