Imran Khan: భారత్ నుంచి పాక్ భూభాగం మీదుగా ఆఫ్ఘనిస్థాన్ కు గోధుమల రవాణా... అనుమతిస్తామన్న ఇమ్రాన్ ఖాన్
- ఆఫ్ఘన్ లో తాలిబన్ల పాలన
- ఆహార సంక్షోభం దిశగా దేశం
- ప్రపంచ దేశాలకు తాలిబన్ల విజ్ఞప్తులు
- ఆఫ్ఘన్ పరిస్థితి పట్ల సానుభూతి వెలిబుచ్చిన భారత్
ఆఫ్ఘనిస్థాన్ లో ఆకలి కేకలు మిన్నంటుతున్న ప్రస్తుత నేపథ్యంలో భారత్ ఆ దేశానికి పెద్ద ఎత్తున గోధుమలు పంపించాలని నిర్ణయించింది. అయితే, ఆఫ్ఘనిస్థాన్ కు గోధుమల రవాణా పాకిస్థాన్ భూభాగం మీదుగా జరగాల్సి ఉంది. ఒకవేళ భారత కేంద్ర ప్రభుత్వం తమను అనుమతి కోరితే తప్పకుండా సానుకూల నిర్ణయం తీసుకుంటామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. ఆఫ్ఘనిస్థాన్ ను ఆదుకునే అంశంలో తమ భూభాగం వినియోగించుకునేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు.
కాగా, ఆఫ్ఘన్ లో ప్రజాప్రభుత్వాన్ని కూల్చివేసి అధికారం చేపట్టిన తాలిబన్లు ప్రపంచ దేశాలు తమను గుర్తించాలని కోరుతున్నారు. పలు దేశాలు గతంలో ప్రకటించిన సాయం తాలూకు నిధులు నిలిచిపోయాయని, వాటిని పునరుద్ధరించాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇప్పటికే ఆఫ్ఘన్ లో ఆహార సంక్షోభం తీవ్రస్థాయికి చేరిన పరిస్థితులను వారు ఉదహరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో భారత్... ఆఫ్ఘన్ ప్రజలకు ఆపన్నహస్తం అందించేందుకు సిద్ధమైంది. దాదాపు 50 వేల మెట్రిక్ టన్నుల గోధుమలు పంపించాలని నిర్ణయించింది. కాగా 2002లో ఆప్ఘన్ లో సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే ఆహార సంక్షోభం ఏర్పడగా భారత్ గోధుమలు పంపాలని భావించింది. అయితే నాడు పాకిస్థాన్ తన భూభాగంపై రవాణాకు అనుమతి నిరాకరించింది. అప్పటి నుంచి భారత్ నుంచి వచ్చిన పలు ప్రతిపాదనలను అక్కడి ప్రభుత్వం నిరాకరిస్తూనే వచ్చింది. తాజాగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సుహృద్భావ ప్రకటన చేయడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.