Rohit Sharma: కోహ్లీ అన్ని ఫార్మాట్లలో దిగిపోవాలి.. రోహిత్ ను పూర్తిస్థాయి కెప్టెన్ చేయాలి: అఫ్రిది
- మామూలు బ్యాటర్ గానే కోహ్లీ రాణిస్తాడు
- ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ దూకుడుగా ఉండాలో రోహిత్ కు బాగా తెలుసు
- ఆలోచనా విధానం గొప్పది
- షాట్ సెలెక్షన్ అమోఘం
విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్ గా తప్పుకోవాలని, కెప్టెన్ గా ఇప్పటికే చాలా క్రికెట్ ఆడేశాడని పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది అన్నాడు. అతడు కెప్టెన్ గా కంటే మామూలు బ్యాటర్ గా బాగా ఆడతాడన్నాడు. కేవలం జట్టు సభ్యుడిగా కొనసాగడం వల్ల విరాట్ పై ఒత్తిడి తగ్గుతుందని, ఫలితంగా మంచి ప్రదర్శన చేస్తాడని తెలిపాడు. టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరించడం అంత సులువు కాదన్నాడు. కెప్టెన్ గా సక్సెస్ లు అందుకున్నన్నాళ్లూ అంతా బాగానే ఉంటుందని చెప్పాడు. టీ20 కెప్టెన్ గా విరాట్ తప్పుకోవడం, రోహిత్ కెప్టెన్ కావడం వంటి ఉదంతాల నేపథ్యంలో అతడు స్పందించాడు.
విరాట్ స్థానంలో టీ20తో పాటు వన్డే కెప్టెన్సీని రోహిత్ కు అప్పగించాలని అతడు స్పష్టం చేశాడు. రోహిత్ అద్భుత ఆటగాడన్నాడు. అతడి ఆలోచనా విధానమే మంచి ఆటగాడిగా నిలబెట్టిందని చెప్పాడు. అవసరమైన చోట మాత్రమే దూకుడుతత్వాన్ని ప్రదర్శిస్తాడని, మిగతా సమయాల్లో కూల్ గా ఉంటాడని ప్రశంసించాడు. ఎక్కడ తగ్గాలో..ఎక్కడ దూకుడుగా ఉండాలో రోహిత్ కు బాగా తెలుసన్నాడు.
ఐపీఎల్ లో డెక్కన్ చార్జర్స్ తరఫున రోహిత్ తో తాను ఏడాది పాటు ఆడానని, అతడి షాట్ సెలెక్షన్ అమోఘమని కొనియాడాడు. టీమిండియా కెప్టెన్సీ మార్పును తాను ముందే ఊహించానని చెప్పుకొచ్చాడు. రోహిత్ కు అవకాశం ఇవ్వడం మంచిదేనని, అందుకు ఇదే మంచి సమయమని స్పష్టం చేశాడు.