CBI: వివేకా హత్య కేసు: దస్తగిరి వాంగ్మూల పత్రాలను న్యాయవాదులకు అందజేసిన సీబీఐ
- వివేకా హత్యకేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి
- దస్తగిరి వైఎస్ వివేకా మాజీ డ్రైవర్
- ప్రొద్దుటూరు కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన దస్తగిరి
- కడప కోర్టులో అప్రూవర్ పిటిషన్ దాఖలు చేసిన సీబీఐ
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ వేగం పెంచింది. తాజాగా కడప సబ్ కోర్టులో వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి పేరుతో సీబీఐ అప్రూవర్ పిటిషన్ దాఖలు చేయగా, ఆ పిటిషన్ పై నిన్న విచారణ జరిగింది. దస్తగిరి వాంగ్మూలం పత్రాలను న్యాయవాదులకు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో దస్తగిరి వాంగ్మూల పత్రాలను సీబీఐ అధికారులు నేడు న్యాయవాదులకు అందజేశారు.
కాగా, దస్తగిరి వాంగ్మూలం ప్రకారం... హత్యలో సునీల్, ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ లతో పాటు తాను కూడా పాల్గొన్నట్టు వెల్లడించాడు. ఆగస్టు 30న ఈ మేరకు దస్తగిరి ప్రొద్దుటూరు కోర్టులో వాంగ్మూలం ఇచ్చాడు. ఆర్థిక లావాదేవీల వల్లే వివేకా హత్య జరిగినట్టు దస్తగిరి తెలిపాడు.
వైఎస్ వివేకా హత్యోదంతంపై సీబీఐ అక్టోబరు 26న చార్జిషీటు నమోదు చేసింది. చార్జిషీటులో సునీల్, ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్, దస్తగిరిల పేర్లను పేర్కొంది. కాగా ఈ కేసులో దస్తగిరికి గత నెలలో బెయిల్ వచ్చింది.