Shilpa Shetty: శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా దంపతులపై ముంబయిలో చీటింగ్ కేసు నమోదు

Cheating case filed on Shilpa Shetty and Raj Kundra
  • ఫిర్యాదు చేసిన పూణే యువకుడు
  • ఫిట్ నెస్ సెంటర్ పేరిట మోసం చేశారని ఆరోపణ
  • రూ.1.51 కోట్లు తీసుకున్నారని వెల్లడి
  • తన డబ్బు తిరిగి ఇప్పించాలని పోలీసులను ఆశ్రయించిన బాంద్రా 
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాను వివాదాలు, కేసులు వీడడం లేదు. తాజాగా శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలతో పాటు ఎస్ఎఫ్ఎల్ ఫిట్ నెస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ కాషీఫ్ ఖాన్ లపై ముంబయిలో చీటింగ్ కేసు నమోదు చేశారు. తనను రూ.1.51 కోట్ల మేర మోసం చేశారంటూ పూణేకు చెందిన యశ్ నితిన్ బరాయ్ అనే యువకుడు ఫిర్యాదు చేయడంతో ముంబయిలోని బాంద్రా పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... యశ్ నితిన్ బరాయ్ (25) కుటుంబానికి పూణేలోని ఇంద్రప్రస్థ ప్రాంతంలో స్థలం ఉంది. అందులో ఫిట్ నెస్ సెంటర్ ఏర్పాటు చేసుకునేందుకు తాము ఫ్రాంచైజీ ఇస్తామని, డబ్బు పెట్టుబడిగా పెట్టాలని అతడిని కాషీఫ్ ఖాన్, శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా తదితరులు 2014లో కోరారు. ఈ వ్యాపారంలో లాభాలు వస్తే వాటా ఇస్తామని అతడిని నమ్మించారు. అప్పటికి యశ్ నితిన్ బరాయ్ మైనర్ కావడంతో అతడి తండ్రి మూడు దఫాలుగా రూ.1.51 కోట్లు చెల్లించాడు.

అయితే, ఆ ఫిట్ నెస్ సెంటర్ ఫ్రాంచైజీ కార్యరూపం దాల్చలేదు. దాంతో తమ డబ్బు తిరిగి ఇచ్చేయాలంటూ యశ్ నితిన్ కోరగా, అతడికి బెదిరింపులు ఎదురయ్యాయి. ఇప్పటివరకు తన డబ్బు తిరిగి చెల్లించకపోవడంతో యశ్ నితిన్ బాంద్రా పోలీసులను ఆశ్రయించాడు.

దీనిపై బాంద్రా పోలీసులు స్పందిస్తూ, ఈ కేసుకు సంబంధించి యశ్ నితిన్ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నామని తెలిపారు. దర్యాప్తులో భాగంగా అన్ని పత్రాలను, బ్యాంకు ఖాతాల లావాదేవీలను పరిశీలిస్తున్నామని వివరించారు.
Shilpa Shetty
Raj Kundra
Kaashif Khan
Cheating
Bandra
Mumbai

More Telugu News