CM Jagan: జోనల్ కౌన్సిల్ సమావేశంలో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించిన సీఎం జగన్

CM Jagan mentions special status issue in southern zonal council meeting

  • అమిత్ షా నేతృత్వంలో దక్షిణాది ప్రాంతీయ మండలి భేటీ
  • తిరుపతిలో సమావేశం
  • హాజరైన ఏపీ సీఎం జగన్
  • రాష్ట్ర విభజన అంశాల ప్రస్తావన

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో తిరుపతిలో జరుగుతున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ సీఎం జగన్ తమ గళం గట్టిగా వినిపించే ప్రయత్నం చేశారు. రాష్ట్రాల మధ్య సమస్యలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని కోరారు. రాష్ట్రాల మధ్య ఏర్పడే సమస్యలకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు.

ముఖ్యంగా విభజన హామీలను ప్రస్తావించారు. విభజన వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయిందని తెలిపారు. రాష్ట్రం విడిపోయి ఏడేళ్లు దాటినా హామీలు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయని వివరించారు. పోలవరం ఖర్చు నిర్ధారణలో 2013-14 నాటి ధరల సూచీతో ఏపీకి అన్యాయం జరిగిందని ఆక్రోశించారు. పోలవరం ఖర్చు అంశంలో విభజన చట్టాన్ని ఉల్లంఘించారని సీఎం జగన్ ఆరోపించారు.

ప్రత్యేక హోదా హామీని కూడా నెరవేర్చలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలు ఇప్పించాలని, తీవ్ర కష్టాల్లో ఉన్న ఏపీ డిస్కంలకు ఉపశమనం కలిగించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తుల పంపకాలు కూడా జరగలేదని నివేదించారు.

గత ప్రభుత్వంలో రుణ పరిమితి దాటారని ఇప్పుడు కోతలు విధించడం అన్యాయమని ఎలుగెత్తారు. రుణాల్లో కోతల అంశంపై వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. అటు, రేషన్ లబ్దిదారుల గుర్తింపు ప్రక్రియలో హేతుబద్ధత లోపించిందని, రేషన్ లబ్దిదారుల గుర్తింపు ప్రక్రియలో సవరణలు చేయాలని అన్నారు.

  • Loading...

More Telugu News