AP High Court: అమరావతి కేసు.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ హైకోర్టు!

AP High Court sensational comments on states development
  • అమరావతి కేసులపై రోజువారీ విచారణ ప్రారంభించిన ఏపీ హైకోర్టు
  • రాష్ట్రంలో అభివృద్ధి మొత్తం ఆగిపోయినట్టు అనిపిస్తోందని వ్యాఖ్య
  • త్రిసభ్య ధర్మాసనం నుంచి ఇద్దరు జడ్జిలను తప్పించాలన్న ప్రభుత్వ విన్నపాన్ని తిరస్కరించిన వైనం
అమరావతి కేసుల రోజువారీ విచారణను ఏపీ హైకోర్టు ఈరోజు ప్రారంభించింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దును సవాల్ చేస్తూ దాఖలైన 90కి పైగా పిటిషన్లపై చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ ప్రారంభించింది. విచారణ సందర్భంగా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో అభివృద్ధి మొత్తం ఆగిపోయినట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. రాజధాని కేసుల విచారణకు అత్యంత ప్రాధాన్యత ఉందని చెప్పింది.

మరోవైపు త్రిసభ్య ధర్మాసనం నుంచి జస్టిస్ సోమయాజులు, జస్టిస్ సత్యనారాయణ మూర్తిలను తప్పించాలని ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్ దవే కోరారు. వారిద్దరికీ రాజధానిలో భూములున్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే, గతంలో ఈ పిటిషన్ల విచారణ జరిగినప్పుడు ఈ విషయంపై ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నిస్తూ... ఆ విన్నపాన్ని హైకోర్టు తిరస్కరించింది. తాము అభ్యంతరం వ్యక్తం చేశామనే విషయాన్ని రేపు తీర్పులో ప్రస్తావించాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టును ఈ సందర్భంగా కోరడం జరిగింది. ఇక అమరావతి రైతుల తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపిస్తున్నారు.
AP High Court
Amaravati
Cases
CRDA

More Telugu News