Mahesh Babu: వార్నర్... ఏం చెప్పమంటావు నీ గురించి?: మహేశ్ బాబు

Mahesh Babu heaps praise on David Warner

  • టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో వార్నర్ ఫిఫ్టీ
  • ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు కైవసం
  • వార్నర్ నువ్వు లెజెండ్ అంటూ మహేశ్ బాబు ప్రశంసలు
  • 7 మ్యాచ్ లలో 289 రన్స్ చేసిన వార్నర్

టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా విజయానికి పునాది వేసింది ఓపెనర్ డేవిడ్ వార్నర్. కివీస్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొని 38 బంతుల్లో 53 పరుగులు చేశాడు. మరోవైపు ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడడంతో ఆస్ట్రేలియా జట్టు తొలిసారిగా టీ20 వరల్డ్ కప్ టైటిల్ కైవసం చేసుకుంది. ఈ అపురూప విజయం అనంతరం ఆసీస్ పై ప్రశంసల జడివాన కురుస్తోంది.

ఈ క్రమంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా స్పందించారు. ఆసీస్ ఉక్కు సంకల్పం ఎలాంటిదో దుబాయ్ లో కళ్లకు కట్టినట్టు కనిపించిందని పేర్కొన్నారు. "టీ20 వరల్డ్ కప్-2021 చాంపియన్స్ గా నిలిచినందుకు ఆస్ట్రేలియా జట్టుకు అభినందనలు. మిత్రమా డేవిడ్ వార్నర్... ఏం చెప్పమంటావు నీ గురించి? నిజంగా నువ్వు లెజెండ్!" అంటూ కొనియాడారు.

వాస్తవానికి ఈ టోర్నీకి ముందు వార్నర్ పై ఎవరికీ అంచనాలు లేవు. ఓ వయసు మళ్లిన, ఫామ్ కోల్పోయిన ఆటగాడ్ని ఎలా చూస్తారో వార్నర్ ను కూడా అలాగే పరిగణించారు. కానీ వార్నర్ కసిదీరా ఆడి తన పనైపోలేదని విమర్శకులకు బ్యాట్ తోనే సమాధానమిచ్చాడు. దీనిపై వార్నర్ భార్య క్యాండిస్ వ్యంగ్యంగా ట్వీట్ చేసింది. "నువ్వు ఫామ్ లో లేవట... బాగా ముసలోడివి అయ్యావట, నత్తనడకన ఆడుతున్నావట... కంగ్రాచ్యులేషన్స్ వార్నర్" అంటూ విమర్శకులకు చురకలు అంటించింది. క్యాండిస్ ఈ కామెంట్లు చేయడం వెనుక వారి కుటుంబం ఇటీవల కాలంలో ఎంత వేదన అనుభవించి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

యూఏఈలో జరిగిన ఐపీఎల్ లో వార్నర్ అత్యంత పేలవంగా ఆడి కెప్టెన్సీ కోల్పోవడమే కాదు, తుది జట్టులోనూ చోటు దొరక్క ఎక్స్ ట్రా ఆటగాళ్ల బెంచ్ కే పరిమితం అయ్యాడు. 2016 సీజన్లో సన్ రైజర్స్ కు ఐపీఎల్ టైటిల్ అందించిన వార్నర్ కు నిజంగా ఇది ఎంతో అవమానకర విషయం. దానికితోడు విమర్శలు వెల్లువెత్తాయి.

ఇవన్నీ మౌనంగా భరించిన ఈ ఎడమచేతి వాటం ఆటగాడు... టీ20 వరల్డ్ కప్ వేదికగా తన బ్యాటింగ్ పవరేంటో చూపాడు. 7 మ్యాచ్ లలో 289 పరుగులు చేయడమే కాదు, ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును కూడా ఎగరేసుకెళ్లాడు. ముఖ్యంగా సెమీఫైనల్లో, ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టు నిలకడగా ఛేజింగ్ చేసిందంటే అది వార్నర్ చలవే. కెప్టెన్ ఆరోన్ ఫించ్ స్వల్ప స్కోర్లకే అవుటైనా, వార్నర్ తన అనుభవాన్నంతా ప్రదర్శించి ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా స్కోరుబోర్డు ముందుకు ఉరికించాడు.

ఇక, మరికొన్ని వారాల్లో ఐపీఎల్ వేలం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. అహ్మదాబాద్, లక్నో ఫ్రాంచైజీలు వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి తమ ప్రస్థానం ప్రారంభించనున్నాయి. క్రికెట్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం... ఈ రెండు కొత్త ఫ్రాంచైజీల్లో ఒకటి వార్నర్ ను కెప్టెన్ గా తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News