Vitamin D: ఆరోగ్య పరిరక్షణకు విటమిన్ డి ఎంత ముఖ్యమో తెలుసా...?

All about Vitamin D

  • శరీరానికి అత్యావశ్యకం విటమిన్ డి
  • విటమిన్ డి లోపంతో అనేక సమస్యలు
  • ఎముకల పటిష్ఠతకు, ఇమ్యూనిటీకి తోడ్పడే విటమిన్
  • సూర్యరశ్మిలో సమృద్ధిగా విటమిన్ డి

మానవ దేహం కూడా ఓ యంత్రం వంటిదే. యంత్రానికి ఇంధనం ఎలాగో మనిషి శరీరానికి ఆహారం అలాగ. ఆ ఆహారంలోనూ శక్తినిచ్చే పోషకాలు, విటమిన్లు ఎంతో ముఖ్యం. ప్రధానంగా ఆరోగ్య పరిరక్షణకు విటమిన్ డి చాలా అవసరం. విటమిన్ డి లోపించిన వ్యక్తిలో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. విటమిన్ డినే సన్ షైన్ విటమిన్ అని కూడా పిలుస్తారు. ఇది సూర్యరశ్మి నుంచి కూడా లభ్యమవుతుంది కాబట్టే ఆ పేరు వచ్చింది.

చాలామంది ఎముకల ఆరోగ్యానికి కాల్షియం ముఖ్యమని భావిస్తారు... కానీ ఆ కాల్షియంను ఎముకలు సరిగ్గా వినియోగించుకునేలా చేసేది ఈ విటమిన్ డినే. అంతేకాదు, విటమిన్ డి మెదడు ఆరోగ్యాన్ని కూడా పరిరక్షిస్తుంది. మానసిక ఆందోళనల స్థాయిని తగ్గించడమే కాకుండా, మానవ దేహంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. తద్వారా వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, జబ్బులను నుంచి దూరంగా ఉంచుతుంది.

కాగా, చలికాలంలో శరీరానికి విటమిన్ డి ఎంతో అవసరమని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ డి లోపంతో కలిగే లక్షణాలను వ్యక్తులు సరిగా గుర్తించలేరని, అలసట, నీరసం, బలహీనత వంటి లక్షణాలు విటమిన్ డి లోపంతోనూ కలుగుతుంటాయని, ఎముకల నొప్పి కూడా విటమిన్ డి లోపించడంవల్లే తలెత్తుతుందని వివరించారు. రికెట్స్ వ్యాధిని అరికట్టడంలో ఈ కీలక విటమిన్ దే ప్రధాన పాత్ర అని తెలిపారు. విటమిన్ డి... కాల్షియం, ఫాస్పరస్ లను గ్రహించి శక్తిమంతమైన ఎముకల నిర్మాణానికి తోడ్పడుతుంది.  

కాగా, శరీరంలో విటమిన్ డి స్థాయులను గుర్తించేందుకు రెండు రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వీటిలో 25-హైడ్రాక్సీ విటమిన్ డి అనే టెస్టును విరివిగా నిర్వహిస్తుంటారు.

విటమిన్ డి లోపంతో బాధపడేవారు సాల్మన్ చేపలు, హెర్రింగ్ మరియు సార్డైన్ చేపలు, కాడ్ లివర్ ఆయిల్, గుడ్డు (పచ్చ సొన), పుట్టగొడుగులు, ఫోర్టిఫైడ్ ఆహారాలు, పాలు, పాల పదార్థాలు, నారింజ రసం, సోయా మిల్క్, తృణ ధాన్యాలు అధికంగా తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తుంటారు. అయితే, వీటన్నింటినీ మించి విటమిన్ డి సూర్యకాంతిలో పుష్కలంగా లభిస్తుంది. ఆరుబయట ప్రాంతాల్లో కాయకష్టం చేసేవారు ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఇదే!

  • Loading...

More Telugu News