Dharmana Prasada Rao: ప్రభుత్వ పనులు చేసిన వారంతా నష్టపోతున్నారు: ధర్మాన ప్రసాదరావు
- సిమెంట్, స్టీల్, ఇసుక ధరలు మండిపోతున్నాయి
- పరువుకు పోయి పనులు చేపట్టిన వైసీపీ ప్రజా ప్రతినిధులు ఇబ్బందులు పడుతున్నారు
- ప్రభుత్వ పెద్దలకు అధికారులు తప్పుడు సలహాలు ఇవ్వొద్దు
వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పనులు చేసిన వారంతా నష్టపోతున్నారని ఆయన అన్నారు. మార్కెట్ లో సిమెంట్, స్టీల్, ఇసుక ధరలు మండిపోతున్నాయని చెప్పారు. పరువుకు పోయి పనులను చేపట్టిన వైసీపీ ప్రజాప్రతినిధులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
ప్రభుత్వం నిర్ణయించిన ఎస్ఎస్ఆర్ రేట్లు కూడా సరిగా లేవని అభిప్రాయపడ్డారు. మెప్పు కోసం ప్రభుత్వ పెద్దలకు అధికారులు తప్పుడు సలహాలు ఇవ్వొద్దని అన్నారు. అధికారుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని చెప్పారు. ఈ విషయాన్ని తాను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లానని అన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో పేదల జీవన ప్రమాణాలు దారుణంగా ఉన్నాయని ధర్మాన చెప్పారు. జిల్లా నుంచి వేలాది మంది ప్రజలు వలస వెళ్తున్నారని తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని సరిగా అమలు చేయలేక పోతున్నామని చెప్పారు. ధర్మాన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.