Pakistan: 29 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ లో ఐసీసీ టోర్నీ... 2025 చాంపియన్ ట్రోఫీకి ఆతిథ్యం
- ప్రధాన టోర్నీల షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ
- వివిధ వేదికల ఖరారు
- 1996లో చివరిసారిగా పాక్ లో వరల్డ్ కప్
- మళ్లీ ఇన్నాళ్లకు అవకాశం
- 2024లో అమెరికా వేదికగా వరల్డ్ కప్
పాకిస్థాన్ లో 1996లో వరల్డ్ కప్ జరిగిన తర్వాత ఇప్పటి వరకు అక్కడ మరో ఐసీసీ టోర్నీ జరగలేదు. ప్రధానంగా ఉగ్రవాదం కారణంగా విదేశీ జట్లు పాక్ లో పర్యటించేందుకు భయపడుతుండడమే అందుకు కారణం. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. 2025లో జరిగే పురుషుల చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు పాక్ కు కట్టబెట్టింది. 29 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై జరగనున్న ఐసీసీ టోర్నీ ఇదే. చివరిసారిగా 1996లో పాకిస్థాన్... భారత్, శ్రీలంకలతో కలిసి వన్డే వరల్డ్ కప్ నిర్వహించింది.
తాజాగా, ఐసీసీ తన మేజర్ టోర్నమెంట్ల వేదికలను నేడు ఖరారు చేసింది. ఆసక్తికర రీతిలో అమెరికా కూడా వరల్డ్ కప్ కు ఆతిథ్యమిచ్చే అవకాశం దక్కించుకుంది. 2024లో పురుషుల టీ20 వరల్డ్ కప్ ఆమెరికా వేదికగా జరగనుంది. ఈ టోర్నీని అమెరికా, వెస్టిండీస్ దేశాల క్రికెట్ బోర్డులు సంయుక్తంగా నిర్వహించనున్నాయి.
ఇక, 2026లో భారత్, శ్రీలంక దేశాల్లో టీ20 వరల్డ్ కప్ జరగనుంది. అంతేకాదు, నమీబియా వంటి దేశానికి వన్డే వరల్డ్ కప్ నిర్వహించే అవకాశాన్ని ఐసీసీ కల్పించింది. 2027లో జరిగే వన్డే ప్రపంచకప్ పోటీలు దక్షిణాఫ్రికా, జింబాబ్వేతో పాటు నమీబియాలోనూ జరగనున్నాయి. ఇక, 2028 టీ20 వరల్డ్ కప్ కు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆతిథ్యమివ్వనున్నాయి.
2029లో చాంపియన్స్ ట్రోఫీ భారత్ లో జరగనుండగా, ఇంగ్లండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్ దేశాలకు 2030లో టీ20 వరల్డ్ కప్ నిర్వహించే చాన్స్ దక్కింది. 2031లో భారత్, బంగ్లాదేశ్ సంయుక్తంగా పురుషుల వరల్డ్ కప్ కు వేదికగా నిలవనున్నాయి.