Corona Virus: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. మొత్తం కేసులో సగం కేరళ నుంచే!
- గత 24 గంటల్లో 10,197 కేసుల నమోదు
- దేశవ్యాప్తంగా 301 మంది మృతి
- 527 రోజులకు చేరిన క్రియాశీల కేసులు
దేశంలో కరోనా కేసులకు సంబంధించి తాజా బులెటిన్ విడుదలైంది. నిన్నటితో పోలిస్తే నేడు కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 10,197 కేసులు వెలుగు చూడగా, 301 మంది కరోనాతో కన్నుమూశారు. 12,134 మంది కోలుకున్నారు. ఇక, క్రియాశీల కేసులు 1,28,555కు తగ్గి 527 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయి.
గత 44 రోజులతో పోలిస్తే రోజువారీ పాజిటివ్ రేటు రెండు శాతం తగ్గి 0.82 శాతానికి చేరుకోగా, వారపు పాజిటివిటీ రేటు గత 54 రోజుల కంటే 2 శాతం తగ్గి 0.96 శాతంగా ఉంది. తాజాగా నమోదైన మొత్తం కేసులలో దాదాపు సగం అంటే 5,516 కేసులు ఒక్క కేరళలోనే నమోదు కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. అలాగే, ఆ రాష్ట్రంలో కరోనాతో 39 మంది మరణించారు.
తాజాగా కేసులు, మరణాలను కలుపుకుంటే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 3.44 కోట్ల మంది కరోనా బారినపడ్డారు. 4,64,153 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, ఇప్పటి వరకు 3.38 కోట్ల మంది కొవిడ్ నుంచి బయటపడ్డారు.